ధరల పెంపునకు ముందు పెట్రోల్ బంకుల మూసివేత!
ABN , Publish Date - May 20 , 2026 | 12:27 AM
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సోమవారం అర్ధరాత్రి ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
రేట్లు పెరుగుతాయని తెలిసి సోమవారం రాత్రి 9 గంటలకే అమ్మకాలు నిలిపివేత
అక్కయ్యపాలెం నుంచి ఎండాడ వరకూ ఇదే పరిస్థితి
అదేబాటలో ఆయిల్ కంపెనీలు
అరకొరగా సరఫరా
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సోమవారం అర్ధరాత్రి ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే అవి అమలులోకి వచ్చాయి. రేట్లు పెరుగుతాయనే విషయం ముందే తెలుసుకున్న పెట్రోల్ బంకుల యజమానులు సోమవారం రాత్రి తొమ్మిది గంటలకే దుకాణం కట్టేశారు. పెట్రోల్ అయిపోయిందని, లైట్లు ఆపేశారు. మలివిడత పెట్రోల్, డీజిల్ లీటరుకు 95 పైసలు చొప్పున పెంచారు. ఎన్ని లీటర్లు ఆదా చేస్తే అన్ని రూపాయల లాభం వస్తుందని గ్రహించిన యజమానులు రాత్రికి రాత్రి బంకులు మూసేశారు. సిటీలో జాతీయ రహదారిపై అక్కయ్యపాలెం మొదలుకొని ఎండాడ వరకు ఇదే పరిస్థితి కనిపించింది. మరోవైపు సీతమ్మధారలో తహశీల్దార్ కార్యాలయం పక్కన హెచ్‌పీసీఎల్ బంకు, బుల్లయ్య కాలేజీ పక్కన హెచ్‌పీసీఎల్ బంకుల్లోను ఇదే జరిగింది. ఆయిల్ కంపెనీలు కూడా రేట్లు పెరుగుతాయని తెలుసుకొని, డీలర్లకు పంపాల్సిన లోడ్‌లను ఆలస్యం చేస్తున్నాయి. రెండు ట్యాంకర్లు అడిగిన వారికి ఒకటి, ఒకటి అడిగిన వారికి సగం ట్యాంకర్ పంపుతున్నాయి. అక్కడితో ఆగకుండా ఎవరికీ 300 లీటర్లకు మించి డీజిల్ విక్రయించవద్దనే షరతులు పెడుతున్నాయి. ఒక వైపు రేట్లు పెంచుతూ మరో వైపు కృత్రిమ కొరత సృష్టించడానికి యత్నిస్తున్నాయి. పశ్చిమ ఆసియా దేశాల యుద్ధం ఇంకా సద్దుమణగకపోవడం, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టకపోవంతో నష్టాల భర్తీకి కేంద్రం ఆయిల్ కంపెనీలకు సహకరిస్తోంది. ప్రజలపై ఒకేసారి భారం మోపకుండా వారం, పది రోజులకు ఒకసారి రేట్లు పెంచాలని సూచించింది. దాంతో పెట్రో ఉత్పత్తుల సరఫరాలో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఎవరికీ ఎక్కువ నిల్వలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. దానికి తగ్గట్టుగా పెట్రోల్ బంకులను రాత్రి తొమ్మిది గంటలకే మూసేస్తున్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖాధికారులు దృష్టి సారించాల్సి ఉంది.
మరోమారు పెట్రో ధరల పెంపు
పెట్రోల్ లీటరు రూ.112.58, డీజిల్ రూ.100.31
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):
కేంద్రం పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు మరో రూ.0.95 పైసలు పెంచింది. దీంతో నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ.112.58, డీజిల్ రూ.100.31కు చేరింది. నగరం, పరిసరాల్లో 121 పెట్రోల్/డీజిల్ బంకులు ఉన్నాయి. రోజుకు సగటున 385 కిలోలీటర్ల పెట్రోల్, 710 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతాయి. పెరిగిన ధరల ప్రకారం పెట్రోల్ వినియోగదారులపై రూ.3.65 లక్షలు, డీజిల్ వినియోగదారులపై 6.74 లక్షలు...మొత్తం రూ. 10.4 లక్షలు అదనపు భారం పడునున్నది. యుద్ధం కొనసాగుతున్నందున ఆయిల్ ధరలు ఇక నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించి పెంచుతారని చెబుతున్నారు.