అధ్వానంగా ‘పేట- పెంటకోట రోడ్డు
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:20 AM
మండలంలో పాయకరావుపేట నుంచి పెంటకోట వెళ్లే రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే నీరు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పలుచోట్ల గోతులతో వాహనదారుల అవస్థలు
తారు ధర పెరిగిందని పనులు ఆపేసిన కాంట్రాక్టర్
పాయకరావుపేట రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలో పాయకరావుపేట నుంచి పెంటకోట వెళ్లే రహదారి గోతులతో అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే నీరు నిలిచిపోయి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాయకరావుపేట నుంచి అరట్లకోట, మంగవరం, గోపాలపట్నం మీదుగా పెంటకోట వరకు సుమారు 13 కిలోమీటర్ల రహదారి ఆర్‌అండ్‌బీ పరిధిలో వుంది. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఏడాది కూడా నిర్వహణ పనులు చేయించకపోవడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి దారుణంగా తయారైంది. కొద్దిపాటి వర్షం కురిసినా గోతుల్లో నీరు చేరి, రహదారి అంతా బురదమయం అవుతున్నది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి అయిన వంగలపూడి అనిత... పాయకరావుపేట- పెంటకోట రహదారి సమస్యపై దృష్టి పెట్టారు. నిధుల లభ్యతనుబట్టి దశలవారీగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాయకరావుపేట శివారు నుంచి మంగవరం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణానికి సుమారు కోటి రూపాయలు మంజూరు చేశారు. తొమ్మిది నెలల క్రితం టెండర్లు ఖరారయ్యాయి. ఇదే సమయంలో మంత్రి అనిత శంకుస్థాపన చేశారు. అయితే ఈ కాంట్రాక్టర్ ఇతరచోట్ల కూడా రోడ్డు పనులు చేస్తుండడంతో పాయకరావుపేట- మంగవరం రోడ్డు పనులు రెండు నెలల క్రితం ప్రారంభించారు. కొన్నిచోట్ల పాత రోడ్డును ఎక్స్‌కవేటర్లతో తవ్వి, రోలర్‌తో చదును చేయించారు. దీనిపై తారు లేయరు వేయాలి. అయితే పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తారు ధరలు రెట్టింపు అయ్యాయి. దీంతో రోడ్డు నిర్మాణ పనులు గిట్టుబాటు కావంటూ కాంట్రాక్టర్ ఆపేశారు. అరట్లకోట గ్రామ పరిధిలో రామాలయం సమీపంలో, ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు మొత్తం ఛిద్రమైంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోవడంపై ఆర్‌అండ్‌బీ అధికారులను వివరణ కోరగా.. తారు ధర విపరీతంగా పెరగడంతో కాంట్రాక్టరు రోడ్డు నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపి వేశారన్నారు. తారు రేటు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తరువాత పనులు పునఃప్రారంభిస్తారన్నారు.