Share News

పసుపు పంటకు తెగుళ్ల బెడద

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:20 PM

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న పసుపు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే తెగుళ్లను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పసుపు పంటకు తెగుళ్ల బెడద
సాగుచేస్తున్న పసుపు పంట

రైతులు అప్రమత్తంగా ఉండాలి

తాటాకు మచ్చ, ఆకు మచ్చను సకాలంలో నివారించుకోవాలి

నిర్లక్ష్యం చేస్తే దిగుబడులపై తీవ్ర ప్రభావం

చింతపల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు సాగు చేస్తున్న పసుపు పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే తెగుళ్లను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఆదివాసీ రైతులు ఆధిక విస్తీర్ణంలో పసుపు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది 26 వేల హెక్టార్లలో పసుపు సాగు జరుగుతోంది.

ప్రధానంగా ఏజెన్సీ రైతులు దేశవాళీ రకాలను సాగు చేసుకుంటున్నారు. అయితే పసుపు పంటను రెండేళ్లపాటు సాగు చేయడం వల్ల రైతులు సమయం, దిగుబడి కూడా నష్టపోతున్నారని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పసుపును 8- 9 నెలల పంటగానే సాగుచేసుకోవాలని శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు రైతులను చైతన్యవంతులను చేస్తున్నారు. అయితే అధిక శాతం రైతులు ఇప్పటికీ రెండేళ్ల పంటగానే సాగుచేస్తున్నారు. రైతులు మార్చిలో పసుపు నాట్లు వేసుకున్నారు. ప్రస్తుతం మొక్కలు అడుగు నుంచి అడుగున్నర ఎత్తులో వున్నాయి. ప్రస్తుత కాలంలో వర్షాలు, గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రత తక్కువగా వుండడంతో ఆగస్టు నుంచి అక్టోబరు వరకు పసుపు పంటను తాటాకు మచ్చ, ఆకు మచ్చ తెగులు ఆశిస్తుందని, సకాలంలో నివారించుకుంటే ప్రమాదం ఉండదని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాటాకు మచ్చ తెగులు

ఆకులపై పెద్ద పెద్ద మచ్చలు అండాకారంలో కనిపిస్తే తాటాకు మచ్చ తెగులు సోకిందని రైతులు గుర్తించాలి. ఈ మచ్చలు ముదురు గోధుమ రంగులో వుండి, మచ్చచుట్టూ పసుపు రంగు వలయం వుంటోంది. ఆకు కాడపై కూడా మచ్చలు ఏర్పడి కాండం ఆకు వాలిపోతుంది.

ఆకు మచ్చ తెగులు

ఆకులపై చిన్నచిన్న పసుపు రంగు చుక్కలు ఏర్పడితే ఆకు మచ్చ తెగులు సోకిందని గుర్తించాలి. అనంతరం ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారతాయి. తెగులు ఉధృతమైతే ఆకు పూర్తిగా మాడిపోతోంది.

Updated Date - Jul 26 , 2026 | 11:20 PM