Share News

టేకు వనాలకు తెగులు

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:11 AM

మన్యంలోని టేకు వనాలకు తెగులు సోకింది. చెట్లను స్కెల్టోనైజర్‌ కీటకం(లార్వా) ఆశించడంతో ఆకుల రంగు మారిపోయింది. ఈ కీటకం ఆశించడం వల్ల కలప నాణ్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

టేకు వనాలకు తెగులు
పెద్దగెడ్డ ప్రధాన రహదారి వద్ద రంగు మారిన టేకు చెట్ల ఆకులు

స్కెల్టోనైజర్‌ కీటకం ఆశించడంతో రంగు మారిన ఆకులు

మన్యంలో ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ వ్యాప్తి

కలప నాణ్యత దెబ్బతింటుందంటున్న శాస్త్రవేత్తలు

నివారణ చర్యలు చేపట్టాలని సూచన

చింతపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని టేకు వనాలకు తెగులు సోకింది. చెట్లను స్కెల్టోనైజర్‌ కీటకం(లార్వా) ఆశించడంతో ఆకుల రంగు మారిపోయింది. ఈ కీటకం ఆశించడం వల్ల కలప నాణ్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు ఎనిమిదేళ్ల తరువాత ఈ కీటకం వనాలపై మళ్లీ కనిపించింది. సాధారణంగా ఈ సీజన్‌లో టేకు వనాలు పచ్చగా ఉంటాయి. అయితే ఈ కీటకం ఆశించడంతో చెట్ల ఆకులు స్వర్ణ వర్ణంలోకి మారిపోయాయి. ఈ కీటకం నివారణకు చర్యలు చేపట్టకపోతే చెట్ల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గిరిజన ప్రాంతంలో సుమారు 1973-74 ప్రాంతం నుంచి అటవీశాఖ పాడేరు, చింతపల్లి డివిజన్ల పరిధిలో టేకు ప్లాంటేషన్‌ సాగు చేస్తున్నది. అటవీశాఖ పరిధిలో రూ.లక్షల విలువ చేసే పురాతన టేకు వనాల ప్లాంటేషన్లు ఉన్నాయి. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ), గిరిజన రైతులు సైతం తక్కువ విస్తీర్ణంలో టేకును సాగు చేసుకుంటున్నారు. మార్కెట్‌లో టేకు కలపకు మంచి డిమాండ్‌ ఉంది. రైతులు నాటుకున్న టేకు వనాలను సైతం కలపగా వినియోగించుకునేందుకు అటవీశాఖ, కలెక్టర్‌ అనుమతి ఉండాలి. అటవీశాఖ, ఏపీఎఫ్‌డీసీ, గిరిజన రైతులకు టేకు వనాల నుంచి మంచి ఆదాయం వస్తున్నది. టేకు మొక్కలకు పెద్దగా సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. మొక్క దశలో మూడేళ్లపాటు కాపాడుకుంటే మహా వృక్షాలవుతాయి. టేకు వనాలు ఏ దశలో ఉన్నప్పటికి స్కెల్టోనైజర్‌ కీటకాలు ఆశించవచ్చు. చింతపల్లి, పాడేరు డివిజన్‌ పరిధిలో టేకు వనాల్లో స్కెల్టోనైజర్‌ కీటకాలు 2018 సెప్టెంబరులో కనిపించాయి. సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ టేకు వనాలు, మొక్కల్లో ఈ కీటకం కనిపించింది.

పత్రహరితాన్ని పీల్చే లార్వా

టేకు వనాలను ఆశించే స్కెల్టోనైజర్‌ లార్వా(కీటకం) ఆకులపై పత్రహరితాన్ని పీల్చివేస్తుంది. ఈ లార్వా ఉధృతి పెరగడం వల్ల ఏజెన్సీ వ్యాప్తంగా ఉన్న టేకు వనాల ఆకులు వర్షాకాలంలో స్వర్ణవర్ణంలోకి మారి రాలిపోయాయి. మళ్లీ మార్చి, ఏప్రిల్‌ వచ్చే వరకు టేకు వనాల్లో పచ్చని ఆకులు కనిపించే పరిస్థితి లేదు. స్కెల్టోనైజర్‌ కీటకం వల్ల వనాలకు పెద్దగా నష్టంలేకపోయినప్పటికి కలప నాణ్యత దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొక్కల దశలో స్కెల్టోనైజర్‌ వ్యాప్తి చెందితే ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

నివారణ చర్యలు చేపట్టడం ఉత్తమం

టేకు వనాలు స్వర్ణ వర్ణంలోకి మారిపోవడానికి స్కెల్టోనైజర్‌ కీటకం ప్రధాన కారణమని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ బాబూజి నాయుడు తెలిపారు. ఈ లార్వా(కీటకం) ఆకులపై ఉన్న పత్రహరితాన్ని గోకి తినివేస్తుందని చెప్పారు. ఆకుల్లో చిన్న, పెద్ద ఈనెలు మాత్రమే మిగులుతాయని, ఆకులను దగ్గరగా చూస్తే ఒక జల్లెడ మాదిరిగా కనిపిస్తుందన్నారు. ఉదయం, సాయంత్రం స్వర్ణ వర్ణంలో కనిపించే ఆకులపై ఉన్న లార్వాను ఇష్టంగా తీనేందుకు పక్షులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయన్నారు. లార్వా వల్ల వృక్షాలకు పెద్దగా హానికలగదని, పదేళ్లలోపు మొక్కలకు ఈ లార్వా సోకితే ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్నారు. లార్వా నివారణకు క్లోరోపైరిఫాస్‌ మందును 2ఎంఎల్‌ లీటరు నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవాలని, ఎకరానికి 40 లీటర్లు అవసరముంటుందని ఆయన చెప్పారు.

Updated Date - Sep 29 , 2026 | 12:11 AM