వీడని గ్యాస్ ట్రబుల్
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:10 AM
మండలంలో ఇంకా గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతోంది. మండల కేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ గ్యాస్ గొడౌన్ వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు బారులుతీరుతున్నారు.
15 రోజుల తరువాత లోడు రావడంతో రద్దీ
వేకువజాము నుంచి వినియోగదారుల పడిగాపులు
బుకింగ్ కౌంటర్ వద్ద తోపులాటలు
పోలీసుల జోక్యంతో సాధారణ స్థితి
క్రమం తప్పకుండా సిలిండర్లు తెప్పించాలని డిమాండ్
పెదబయలు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఇంకా గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగుతోంది. మండల కేంద్రంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ గ్యాస్ గొడౌన్ వద్ద సిలిండర్ల కోసం వినియోగదారులు బారులుతీరుతున్నారు. మండలానికి ఒకే ఒక్క గొడౌన్ ఉండడంతో 23 పంచాయతీల వినియోగదారులతో పాటు సరిహద్దులోని ఒడిశా వాసులు కూడా ఇక్కడికే వస్తుంటారు. 15 రోజుల తరువాత బుధవారం గ్యాస్ లోడు రావడంతో తెల్లవారుజాము నుంచి వినియోగదారులు పడిగాపులు కాశారు. దీంతో రసీదు కౌంటర్ వద్ద తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి క్యూలైన్‌ను క్రమబద్ధీకరించారు.
సరిపడా సిలిండర్లు రాక ఇబ్బందులు
మండల వ్యాప్తంగా సుమారు 11,500 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే గొడౌన్‌కు నెలలో ఒకటి లేదా రెండు లోడ్లు మాత్రమే వస్తున్నాయి. ఒక్కో లోడులో సుమారు 520 నుంచి 540 సిలిండర్లు మాత్రమే రావడంతో డిమాండ్‌కు ఏమాత్రం సరిపోవడం లేదు. పైగా మండలంలో గల ఆశ్రమ పాఠశాలలకు ఒక లోడులో సుమారు 200 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలిన సిలిండర్లు వినియోగదారులకు ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో గ్యాస్ లోడు వస్తుందనే సమాచారం అందగానే గొడౌన్ వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. కాగా సిలిండర్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. తోపులాటల్లో మహిళలు, వృద్ధులు నలిగిపోతున్నారు. మండలంలోని కనెక్షన్ల సంఖ్యకు అనుగుణంగా క్రమం తప్పకుండా గ్యాస్ లోడ్లు సరఫరా చేయాలని, కనీసం వారానికి ఒక లోడు అయినా వచ్చేలా జీసీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. దీనిపై జీసీసీ మేనేజర్ జి.అప్పన్నను వివరణ కోరగా, డిమాండ్‌కు తగ్గట్టుగా సిలిండర్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని, ఇటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.