కొనసాగుతున్న ముసురు
ABN , Publish Date - Sep 16 , 2026 | 01:05 AM
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులు కురవగా, ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో వర్షాలు కురుస్తుండడంతో గెడ్డల్లో నీటి ప్రవాహ ఉధృతి కొనసాగుతున్నది.
పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం
ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు
పాడేరు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏజెన్సీలో మంగళవారం ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో జల్లులు కురవగా, ఇతర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఏజెన్సీలో వర్షాలు కురుస్తుండడంతో గెడ్డల్లో నీటి ప్రవాహ ఉధృతి కొనసాగుతున్నది. ముఖ్యంగా ఒడిశాను ఆనుకుని ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, హుకుంపేట, జీకేవీధి మండలాల్లోని గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదిలా ఉండగా ముసురు వాతావరణంతో వర్షాలు కురుస్తున్నా గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేదు.
జి.మాడుగులలో..
మండలంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ కాసి, మఽధ్యాహ్నం ఒక్కసారి వాతావరణం మారి భారీ వర్షం పడింది. మంగళవారం వారపు సంత కావడంతో వ్యాపారులు, జనాలు ఇబ్బందులు పడ్డారు. వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతగిరిలో..
మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లుపై వాహనాల ప్రయణాలు నిలిచిపోయాయి. గత కొద్దిరోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న తరణంలో వర్షాలు కురువడంతో పంటలకు మేలు జరిగిందని వారంటున్నారు. పొలాలకు వరదనీరు చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తంచేశారు.