కొనసాగుతున్న ముసురు
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:17 PM
ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో సోమవారం ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి.
ఏజెన్సీలో ఒక మోస్తరు వర్షాలు
పాడేరు, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో సోమవారం ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడుతుండగా, ఒడిశాకు సరిహద్దున ఉన్న ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, జీకేవీధి, తదితర మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. తాజా వర్షాలు ఖరీఫ్ పంటల సాగుకు మేలు చేస్తాయని రైతులు అంటున్నారు. తాజా వాతావరణంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కొయ్యూరులో 30.6, అనంతగిరిలో 26.0, అరకులోయ 28.9, చింతపల్లిలో 23.9, పాడేరులో 23.2, హుకుంపేటలో 22.9, ముంచంగిపుట్టులో 21.8, పెదబయలులో 22.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సీలేరులో...
సీలేరు: జీకే వీధి మండలం సీలేరులో సోమవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. ముసురు ప్రభావంతో రోజువారీ కూలీలకు ఉపాధి లేక ఇళ్లకే పరిమితమయ్యారు. విద్యాలయాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.