గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తప్పనిసరి
ABN , Publish Date - Mar 06 , 2026 | 01:19 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గనుల లీజు, సీనరేజీ వసూళ్ల ద్వారా రూ.85 కోట్ల ఆదాయం సాధించాలనేది లక్ష్యం కాగా జనవరి నెలాఖరు నాటికి రూ.66 కోట్లు వచ్చినట్టు జిల్లా గనులు, భూగర్భ శాఖాధికారి ఇ.నరసింహరెడ్డి తెలిపారు.
‘ఆంధ్రజ్యోతి’తో జిల్లా గనులు, భూగర్భ శాఖాధికారి ఇ.నరసింహరెడ్డి
అక్రమాలకు పాల్పడితే జరిమానా విధిస్తాం
పేదల ఇళ్ల నిర్మాణాలకు లక్ష టన్నుల ఇసుక అవసరం
త్వరలో టెండర్లు పిలుస్తాం
2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లక్ష్యం రూ.85 కోట్లు
జనవరి నెలాఖరు నాటికి రూ.66 కోట్లు రాక
విశాఖపట్నం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గనుల లీజు, సీనరేజీ వసూళ్ల ద్వారా రూ.85 కోట్ల ఆదాయం సాధించాలనేది లక్ష్యం కాగా జనవరి నెలాఖరు నాటికి రూ.66 కోట్లు వచ్చినట్టు జిల్లా గనులు, భూగర్భ శాఖాధికారి ఇ.నరసింహరెడ్డి తెలిపారు. ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. గనుల శాఖకు ఆదాయం ప్రధానంగా తాత్కాలిక పర్మిట్లు జారీ, గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు, ప్రభుత్వ పనులకు మెటీరియల్ సరఫరా ద్వారా వస్తుందన్నారు. నగరంలో భారీ నిర్మాణాల కోసం పర్మిట్లు తీసుకునే నిర్మాణదారులు సీనరేజీ చెల్లిస్తారని చెప్పారు. జిల్లాలో మొత్తం 35 క్వారీలకుగాను ప్రస్తుతం 11 మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలినవి పలు కారణాలతో మూతపడ్డాయన్నారు. కాలపరిమితి ముగిసిన క్వారీలకు రెన్యువల్ చేయాలంటే తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్నారు. పద్మనాభం మండలం కృష్ణాపురంలో మెటల్ క్వారీ తవ్వకాలకు లీజుదారులు ప్రభుత్వానికి దరఖాస్తు చేశారన్నారు. ఆనందపురం మండలం జగన్నాథపురంలో ఒక క్వారీ మాత్రమే నడుస్తోందని, మరో రెండు క్వారీలకు త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నదన్నారు. అనుమతులు లేకుండా ఇచ్ఛాపురంలో ప్రభుత్వ భూమిలో రహదారి కోసం తవ్వకాలు చేపట్టిన మెషినరీ యజమానికి జరిమానా విధించామన్నారు. వెల్లంకి పంచాయతీలో ప్రభుత్వ భూమిలో రాళ్లు తవ్వి మట్టి తరలిస్తున్న వాహనాలకు రూ.25 వేలు జరిమానా విధించామన్నారు. నగర పరిసరాల్లో పలు కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల కోసం నెలకు 25 వేల టన్నులు వంతున జూన్ వరకూ లక్ష టన్నుల ఇసుక అవసరమని గుర్తించామన్నారు. ఆయా లేఅవుట్‌లకు ఇసుక సరఫరాకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. నగరంలో మూడు ప్రైవేటు ఇసుక డిపోలు కొనసాగుతాయని పేర్కొంటూ, వర్షాకాలంలో నిర్మాణాలకు అవసరమైన ఇసుక నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామని నరసింహరెడ్డి తెలిపారు. పర్మిట్లు లేకుండా మట్టి, గ్రావెల్ తవ్వకాలు చేపట్టినా, అక్రమంగా రవాణా చేసినా జరిమానా విధిస్తామన్నారు.