Share News

ఇక పక్కాగా అటెండెన్స్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:22 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో అటెండెన్స్‌ నమోదుకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇక పక్కాగా అటెండెన్స్‌

  • ఏయూ అనుబంధ కాలేజీల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ అమలుకు నిర్ణయం

  • ఈ మేరకు కాలేజీలకు ఆదేశాలు జారీ

  • వర్సిటీ పరిఽధిలో 300కుపైగా డిగ్రీ, పీజీ, బీఈడీ, లా కాలేజీలు

  • తొలిదశలో వంద కళాశాలల్లో ఏర్పాటు

విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో అటెండెన్స్‌ నమోదుకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అనుబంధ కాలేజీల్లో అనేకచోట్ల అవకతవకలు జరుగుతున్నాయన్న అరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రధానంగా లా, బీఈడీతోపాటు కొన్ని డిగ్రీ, పీజీ కాలేజీలు విద్యార్థులు లేకుండా నడుస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడాన్ని గుర్తించారు. అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ నిర్ణయించారు. అందుకుముందుగా అనుబంధ కాలేజీల్లో విద్యార్థుల అటెండెన్స్‌ పక్కాగా ఉండేలా ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) తీసుకురానున్నారు. ఈ మేరకు ఆయా కాలేజీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ పరికరాలు ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్సిటీ అధికారులే ఆయా పరికరాలను కొనుగోలు చేసి కాలేజీల్లో ఏర్పాటుచేయనున్నారు. అందుకు అయ్యే మొత్తాన్ని కాలేజీల నుంచి వసూలు చేయాలా? లేక వర్సిటీనే భరించాలా?...అన్న దానిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

తొలి దశలో 100 కొనుగోలు..

ఏయూ పరిఽధిలో 300కుపైగా కాలేజీలు ఉన్నాయి. తొలి దశలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 100 కాలేజీల్లో ఈ పరికరాలను ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో బీఈడీ, లా కాలేజీలు ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండరింగ్‌ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో కొనుగోలు చేసిన పరికరాల పనితీరు, ఇతర ఇబ్బందులను అధ్యయనం చేసిన తరువాత మిగిలిన కాలేజీలకు కొనుగోలు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.

వర్సిటీ నుంచి పర్యవేక్షణ

ఎఫ్‌ఆర్‌ఎస్‌ పరికరాలు ఏర్పాటుచేసిన తరువాత ఆయా కాలేజీల్లో విద్యార్థులతోపాటు ఫ్యాకల్టీ హాజరును వర్సిటీ నుంచి పర్యవేక్షించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాలేజీల్లో ఏర్పాటు చేసిన మెషిన్స్‌లో విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ పూర్తికాగానే ఏయూ కంప్యూటర్‌ కేంద్రంలో నమోదయ్యేలా ప్రత్యేక యాక్సిస్‌ను ఇవ్వనున్నారు. దీనివల్ల ఆయా కాలేజీలకు ప్రతిరోజూ ఎంతమంది విద్యార్థులు వస్తున్నారు, ఏ టైమ్‌కు వెళుతున్నారన్న విషయాలను పర్యవేక్షించేందుకు అవకాశం ఏర్పడనుంది. ఈ విధానం అమలుతో కాలేజీల్లో అటెండెన్స్‌ పేరుతో జరిగే అవకతవకలకు చెక్‌ చెప్పేందుకు అవకాశం ఉంటుందని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Feb 21 , 2026 | 12:22 AM