Share News

అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:09 AM

అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.ఎన్‌.హరింధర ప్రసాద్‌ చెప్పారు. ఆయన మంగళవారం దేవదాయ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు

ఉదయం 5 గంటల వరకే ప్రముఖులకు దర్శనాలు

సాధారణ భక్తులకు అత్యధిక ప్రాధాన్యం

కలెక్టర్‌ డా.ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌

సింహగిరిపై ఏర్పాట్ల పరిశీలన

సింహాచలం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి):

అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.ఎన్‌.హరింధర ప్రసాద్‌ చెప్పారు. ఆయన మంగళవారం దేవదాయ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది కూడా గత ఏడాది మాదిరిగా సుమారు 2.2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఉత్సవ విజయవంతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనువంశిక ధర్మకర్త కుటుంబీకులు తొలిదర్శనం చేసుకున్న తరువాత వేకువజామున 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే ప్రత్యేక స్లాట్లు కేటాయించడం ద్వారా ప్రముఖులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. సాధారణ భక్తులకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు దర్శనాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉదయం 5 గంటలలోపు మాత్రమే అంతరాలయ దర్శనాలు ఉంటాయన్నారు. ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్‌లను అనుమతించబోమన్నారు. ఏప్రిల్‌ 20న చందనోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో సివిల్‌, ఎలక్రిక్టల్‌ పనులన్నింటినీ మార్చి నెలాఖరుకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌తోపాటు పర్యాటక శాఖ ఈడీ కల్యాణి, సింహాచల దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె.వెంకటరావు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 01:09 AM