Share News

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 22 , 2026 | 01:13 AM

పరీక్షల సీజన్‌ ప్రారంభం కాబోతోంది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకేషనల్‌ విద్యార్థులకు ఈనెల 27 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

ఇంటర్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

1 నుంచి ప్రాక్టికల్స్‌

ఒకేషనల్‌ విద్యార్థులకు ఈనెల 27న ప్రారంభం

ఫిబ్రవరి 23 నుంచి థియరీ పరీక్షల నిర్వహణ

జిల్లాలో 85 కేంద్రాలు ఏర్పాటు

హాజరుకానున్న 81,001 మంది విద్యార్థులు

ఆర్‌ఐవో మురళీధర్‌

మద్దిలపాలెం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి):

పరీక్షల సీజన్‌ ప్రారంభం కాబోతోంది. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఒకేషనల్‌ విద్యార్థులకు ఈనెల 27 నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. కాగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ‘నైతికత-మానవ విలువలు’పై బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 39,840 మంది హాజరయ్యారు. 23న పర్యావరణ విద్యపై పరీక్ష జరుగుతుంది. యువతలో నైతిక విలువలు పెంపొందించడం, పర్యావరణం, పచ్చదనంతోనే మానవాళి మనుగడ సాధ్యమని అవగాహన కల్పించడంలో భాగంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి చేశారు.

పరీక్షలిలా...

ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యార్థులకు ఈనెల 27 నుంచి, రెగ్యులర్‌ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈపరీక్షలకు జిల్లాలోని 30,433 మంది ఎంపీసీ, 4,971 మంది బైసీపీ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 159 కేంద్రాలను ఎంపిక చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్‌ పరీక్షల హాల్‌టికెట్లు ఈనెల 24 నుంచి సంబంధిత కళాశాలల్లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సౌలభ్యం కోసం మనమిత్ర వాట్సాప్‌ ద్వారా కూడా పొందే అవకాశాన్ని కల్పించింది. 95523 00009 నంబరుకు హాయ్‌ అని సందేశం పంపించి హాల్‌ టికెట్‌ పొందవచ్చు.

కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో 85 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 40,165 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 40,836 మంది హాజరుకానున్నారు.

పక్కాగా ఏర్పాట్లు

- బి.మురళీధర్‌, ఆర్‌ఐవో

జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పక్కాగా చేశాం. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్షలు జరుగుతున్న తీరు ఇక్కడి ఆర్‌ఐవో కార్యాలయంతో పాటు అమరావతిలోని ఇంటర్‌బోర్డు కమిషనర్‌ కార్యాలయంలో లైవ్‌ స్ర్టీమింగ్‌ జరుగుతుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాం. అవసరమైన సిబ్బందిని నియమించాం.

Updated Date - Jan 22 , 2026 | 01:13 AM