మోదకొండమ్మ ఉత్సవాలకు పక్కా ఏర్పాట్లు
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:15 PM
మోదకొండమ్మ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు.
అధికారులను ఆదేశించిన కలెక్టర్ నిశాంతి
ఉత్సవాల నిర్వహణాధికారిగా పీవో ఆదిత్మవర్మకు బాధ్యతలు
పాడేరు, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): మోదకొండమ్మ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఉత్సవాల ఏర్పాట్లపై జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మే నెల 17, 18, 19 తేదీల్లో జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉత్సవాల నిర్వాహణాధికారిగా ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మకు బాధ్యతలు అప్పగిస్తున్నామని, ఆయన ఉత్సవాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటారన్నారు. ఉత్సవాల్లో ఏర్పాట్లకు ముందస్తుగా రూ.10 లక్షలు విడుదల చేస్తున్నామని, వాటిని ఆయా శాఖల అధికారులకు ఇస్తున్నామన్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని, భద్రత, ట్రాఫిక్ వంటి అంశాలపై పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో శాఖాధికారికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నామన్నారు. జూనియర్ కాలేజీ మైదానంలో స్టేజ్, ప్రభుత్వ స్టాళ్లు, జనరేటర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాట్లను గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ చేయాలని, తాగునీటి సరఫరా, సంచార మరుగుదొడ్లను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సాంస్కృతిక బృందాలకు గౌరవ వేతనం, వసతులు, భక్తులకు పులిహోర ప్యాకెట్ల పంపిణీని గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ చేపట్టాలని, రోడ్ల, భవనాల శాఖాధికారులు డిగ్రీ కాలేజీ రోడ్డుకు మరమ్మతులు చేయాలని, పారిశుధ్య పనులను డీఎల్‌పీవో చేపట్టాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా పనులు చేపట్టేందుకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు రూ.3 లక్షలు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు రూ.2 లక్షలు, గిరిజన సంక్షేమ విద్యాశాఖకు రూ.3 లక్షలు, రోడ్ల, భవనాల శాఖకు రూ.1 లక్షా, డివిజనల్ పంచాయతీ అధికారికి రూ.1 లక్షా విడుదల చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఏవో ఎం.హేమలత, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డేవిడ్‌రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ బీవీ.నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.