Share News

అన్నింట్లోనూ పర్సంటేజీ!

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:39 AM

గత ఏడాది డిసెంబరు నెలాఖరున పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విశాఖ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కె.శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.

అన్నింట్లోనూ పర్సంటేజీ!

  • ఇదీ పంచాయతీరాజ్‌ శాఖ రిటైర్డ్‌ ఎస్‌ఈ కె.శ్రీనివాసరావు తీరు

  • ప్రాజెక్ట్సు డివిజన్‌ ఈఈగా ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించారని అభియోగాలు

  • ఏజెన్సీలో నిర్మించిన రోడ్లకు సంబంధించిన బిల్లుల మంజూరుకు భారీగా వసూళ్లు

  • ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టినట్టు గుర్తించి ఏసీబీ సోదాలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి):

గత ఏడాది డిసెంబరు నెలాఖరున పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ విశాఖ సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కె.శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఆయన ప్రాజెక్ట్సు డివిజన్‌ ఈఈగా పనిచేసిన సమయంలో పాడేరు సహా ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ల నుంచి భారీగా పర్సంటేజీలు తీసుకున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు.

ఏజెన్సీలో మావోయిస్టుల ప్రభావం తగ్గించేందుకు రోడ్‌ కనెక్టవిటీ ప్రాజెక్టు ఫర్‌ లెఫ్ట్‌ వింగ్‌ ఎక్స్‌ట్రీమిజం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యుఈ) కింద కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మంజూరుచేసింది. ఈ నిధుల వ్యయంలో భారీగా అక్రమాలు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పాడేరులో ఎక్కువకాలం ఈఈగా పనిచేసిన శ్రీనివాసరావు 2021లో విశాఖలోని జడ్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న ప్రాజెక్ట్సు డివిజన్‌కు వచ్చారు. రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపే బాధ్యత ప్రాజెక్ట్సు డివిజన్‌దే. పనులు పాడేరు ప్రాంతంలోనే జరిగినా ఎం.బుక్‌ రికార్డు నుంచి బిల్లులు మంజూరు వరకు మొత్తం తంతు ప్రాజెక్ట్సు డివిజన్‌లోనే జరిగేవి. పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లుల కోసం సిబ్బంది నుంచి ఈఈ వరకూ ప్రతి ఒక్కరికీ పర్సంటేజీలు ఇవ్వాల్సి వచ్చేది. ఆ సమయంలో ఈఈగా ఉన్న శ్రీనివాసరావు భారీగానే పర్సంటేజీలు తీసుకున్నారని చెబుతుంటారు. 2024 సెప్టెంబరు ఒకటో తేదీన అదే ప్రాంగణంలోని సర్కిల్‌ ఎస్‌ఈగా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత 21 రోజులకు అంటే 2024 సెప్టెంబరు 22న ఎస్‌ఈగా పదోన్నతి రావడంతో పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ప్రాజెక్ట్సు ఈఈగా పనిచేసే సమయంలో పాడేరు ప్రాంతంలో వందల కోట్ల విలువైన రోడ్ల పనుల బిల్లులు విశాఖలోనే మంజూరుచేసేవారు. అక్కడ నుంచి ఎస్‌ఈగా పదోన్నతి వచ్చిన తరువాత రోడ్డు పనుల బిల్లులు మంజూరు అధికారం పాడేరులోని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈఈకు బదలాయించారు. దీనిపై ప్రాజెక్ట్సు విభాగంలో కొందరు అప్పట్లో అభ్యంతరం చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. పంచాయతీరాజ్‌ సర్కిల్‌లో ఏడాదికిపైగా పనిచేసిన శ్రీనివాసరావు 2025 డిసెంబరు నెలాఖరున పదవీ విరమణ చేశారు. ఇక్కడ కూడా బిల్లులు మంజూరులో పర్సంటేజీలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే రిటైర్డు ఎస్‌ఈ ఆస్తులపై ఏసీబీ దాడులు చేస్తున్న విషయం తెలిసి సర్కిల్‌ కార్యాలయంలో అధికారులు, సంఘ నేతలు గప్‌చిప్‌గా ఉన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:39 AM