మిరియాలు కిలో రూ.700
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:24 AM
మన్యంలో ఈ ఏడాది మిరియాల ధర ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలోనే కిలో రూ.650 నుంచి రూ.700 ధరకు వర్తకులు కొనుగోలు చేస్తుండడంతో తర్వాత ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, వర్తకులు అభిప్రాయపడుతున్నారు.
- వారపు సంతల్లో జోరుగా కొనుగోళ్లు
పాడేరు, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఈ ఏడాది మిరియాల ధర ఆశాజనకంగా ఉందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీజన్ ప్రారంభంలోనే కిలో రూ.650 నుంచి రూ.700 ధరకు వర్తకులు కొనుగోలు చేస్తుండడంతో తర్వాత ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, వర్తకులు అభిప్రాయపడుతున్నారు. శనివారం హుకుంపేట వారపు సంతలో కిలో రూ.680 చొప్పున గిరిజన రైతులు వర్తకులకు మిరియాలను విక్రయించారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఏడాది మిరియాలు ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు అంటున్నారు. గతంలో సీజన్ ప్రారంభంలో కిలో రూ.550 నుంచి క్రమంగా సీజన్ ముగిసే నాటికి కిలో రూ.650 వరకు పెరిగింది. అలాగే ఈ ఏడాది సీజన్ మొదట్లోనే రూ.680 నుంచి రూ.700 ధర ఉండడంతో సీజన్ ముగిసే నాటికి మరింత పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ప్రస్తుత ధర పెరగకపోయినా తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మార్కెటింగ్ సదుపాయం ఊసే లేదు
ఏజెన్సీలో వేల ఎకరాల్లో కాఫీ తోటల్లో మిరియాలు పాదులున్నాయి. సుమారు 15 వేల నుంచి 20 వేల టన్నుల వరకు మిరియాలు ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ మన్యంలో మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర ఉండడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గిరిజన సహకార సంస్థ, స్పైసెస్ బోర్డు వంటి సంస్థలు గిరిజనుల నుంచి మిరియాలును కొనుగోలు చేసి దేశీయ మార్కెట్‌లో విక్రయించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అయితే గిరిజన ప్రాంతంలో మిరియాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తామని, ఐటీడీఏ ఆధ్వర్యంలోనే వంద టన్నులు కొనుగోలు చేస్తామని గతేడాది అధికారులు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రభుత్వ సంస్థలు మిరియాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే తమకు కనీస మద్దతు ధర దక్కి, నష్టపోకుండా ఉంటామని గిరిజన రైతులు అంటున్నారు.