Share News

ఆశాజనకంగా మిరియాల ధర

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:34 PM

గిరిజన ప్రాంతంలో మిరియాల పంట తగ్గినప్పటికి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆశాజనకంగా మిరియాల ధర
అద్దరవీధిలో మిరియాలను గుత్తుల నుంచి వేరుచేస్తున్న గిరిజనులు

గత ఏడాది కిలో రూ.580 కాగా, ఇప్పుడు రూ.650

కొచ్చిన్‌ మార్కెట్‌లో రూ.700-800

ప్రభుత్వం మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఆ ధర లభించే అవకాశం

చింతపల్లి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో మిరియాల పంట తగ్గినప్పటికి ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే గిరిజన రైతులకు గరిష్ఠ ధర లభిస్తున్నది. గత ఏడాది కిలో రూ.580 కాగా, ప్రస్తుతం ప్రైవేటు వర్తకులు కిలో రూ.650 ధరకు కొనుగోలు చేస్తున్నారు. అయితే కొచ్చిన్‌ మార్కెట్‌లో కిలో మిరియాలు నాణ్యత ఆధారంగా రూ.700-800 ధర లభిస్తున్నది. ఆ ధర ఇక్కడ లభించేలా ఐటీడీఏ, గిరిజన సహకార సంస్థ మిరియాల పంటకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలని ఆదివాసీ రైతులు కోరుతున్నారు.

జిల్లాలో గిరిజన రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను సాగు చేస్తున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 1.1 లక్షల ఎకరాల్లో మిరియాల పంటను సాగు చేస్తున్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉంటే ఎకరానికి 150- 200 కిలోలు వస్తుంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరియాల దిగుబడులు భారీగా పతనమయ్యాయి. ఎకరానికి 60-80 కిలోల దిగుబడులు మాత్రమే వచ్చాయి. గిరిజన రైతులు ఈ మిరియాల దిగుబడులను ప్రైవేటు వర్తకుల ద్వారానే మార్కెటింగ్‌ చేసుకుంటున్నారు.

జాతీయ మార్కెట్‌లో భారీగా పెరిగిన ధరలు

ఈ ఏడాది మిరియాలకు జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. మిరియాల పంట ధరలు ప్రధానంగా కొచ్చిన్‌ మార్కెట్‌పై ఆధాపడి వుంటాయి. దేశవ్యాప్తంగా కొచ్చిన్‌ మార్కెట్‌లోనే మిరియాలకు ధరలు నిర్ణయిస్తుంటారు. ఈ ఏడాది మార్కెట్‌ ప్రారంభం నుంచి కిలో ఎండు మిరియాల ధర రూ.700 మించి పలుకుతోంది. ప్రస్తుతం కొచ్చిన్‌ మార్కెట్‌లో ప్రీమియం బోల్డ్‌ రకం కిలో రూ.950-1000 ధర లభిస్తుంది. సాధారణ రకాల మిరియాలు నాణ్యత ఆధారంగా రూ.700-800 ధర పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు అధికంగా ఉండడంతో ప్రాంతీయ మార్కెట్‌లోనూ ప్రైవేటు వర్తకులు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌ ప్రారంభంలో కిలో మిరియాలను ప్రైవేటు వర్తకులు రూ.700 ధరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం జాతీయ మార్కెట్‌లో ధరలు స్థిరంగా ఉన్నప్పటికి ప్రైవేటు వర్తకులు కిలో రూ.650 ధరకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే మిరియాల పంట ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికి అంతర్జాతీయ ధరలు అందడంలేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మిరియాల పంటకు ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం లేదు. దీంతో ప్రైవేటు వర్తకులు మిరియాల ధరలను నిర్ణయిస్తున్నారు.

-----------------

మిరియాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి (ఫొటో- 29సీటీపీ5)

మిరియాలను ప్రైవేటు వర్తకులకు మాత్రమే విక్రయించుకోవాల్సి వస్తుంది. కాఫీ మాదిరిగా జీసీసీ మిరియాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పిస్తే అంతర్జాతీయ ధరలు రైతులకు అందుతాయి. జీసీసీ గరిష్ఠ ధర ప్రకటిస్తే ప్రైవేటు వర్తకులు సైతం అదే ధరకు కొనుగోలు చేస్తారు. కలెక్టర్‌, జీసీసీ ఎండీ స్పందించి మిరియాలకు మార్కెటింగ్‌ సదుపాయం కల్పించాలి.

- మామిడి బాలయ్య, జీకేవీధి

Updated Date - Mar 29 , 2026 | 11:34 PM