ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా పాల్గొనాలి
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:52 AM
జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొని ఓట్లు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి అన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి
పాడేరులో ఉత్సాహంగా పోలీసు ప్లాగ్ మార్చ్
పాడేరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా పాల్గొని ఓట్లు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు జిల్లా కేంద్రంలో సోమవారం పోలీసులు నిర్వహించిన ప్లాగ్ మార్చ్‌లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఎన్నికల్లో పాల్గొనేందుకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను పోలీసులు చేపడుతున్నారని, ఈ క్రమంలో ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేశామని, ప్రజలు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. ఈక్రమంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజలు, అందరూ ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని, సమాజంలో శాంతిభద్రతలకు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోలీసు యంత్రాంగం చేపడుతున్న చర్యలను ఎన్‌పీ అమిత్‌బర్దార్ వెల్లడించారు. పోలీసుల చేతుల్లో ఉండే పలు రకాల తుపాకీల పనితీరును కలెక్టర్ నిషాంతికి ఎస్‌పీ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పీ వై.శృతి, మండల రిటర్నింగ్ అధికారి భానుమూర్తిరాజు, డీఎస్‌పీ వి.రాజసింహారెడ్డి, సీఐ వెంకటరావు, ఎస్‌ఐలు, సీఆర్‌పీఎఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.