Share News

మన్యంలో 10 వేల మందికి పెన్షన్లు

ABN , Publish Date - May 23 , 2026 | 11:21 PM

జిల్లాలో పది వేల మందికి కొత్తగా ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్లు అందనున్నాయి.

మన్యంలో 10 వేల మందికి పెన్షన్లు

60 ఏళ్లు నిండిన వృద్ధులు, 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్‌సీ, ఎస్టీలకు పెన్షన్‌

ఎన్నికల హామీ అమలుకు కూటమి సర్కారు సన్నాహాలు

గిరిజనులకు ఎంతో మేలు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పది వేల మందికి కొత్తగా ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్లు అందనున్నాయి. సహజంగా 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పెన్షన్‌ అందిస్తుండగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పెన్షన్లకు శ్రీకారం చుట్టలేదు. అయితే ఎన్నికల హామీలను అమలు చేయడంతోపాటు అర్హులైన వారందరికీ ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్‌ అందించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కాస్త గ్యాప్‌ తీసుకుందని అధికారులు అంటున్నారు. ఈక్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 60 ఏళ్లు నిండిన వృద్ధులతోపాటు 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీలకు వృద్ధాప్య పెన్షన్‌ అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వ కసరత్తు చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మందికి లబ్ధిచేకూరుతుందని ఒక అంచనాకు వచ్చింది.

పది వేల మందికి లబ్ధి

రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్‌ భరోసా పెన్షన్‌ పథకం ద్వారా జిల్లాలో కొత్తగా 10 వేల మందికి లబ్ధిచేకూరనుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పదకొండు మండలాల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, వైద్య పెన్షన్లు పొందుతున్న వారు 73,700 మంది ఉన్నారు. అయితే తాజా ప్రతిపాదనల ప్రకారం జిల్లాలో 60 ఏళ్లు నిండిన కొత్తవారితోపాటు 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్‌సీ, ఎస్టీ లబ్ధిదారులు మరో 10 వేలు వరకు ఉంటారని అధికారులు అంటున్నారు. వారిలో ఎస్‌టీలు 8,500 మంది, ఎస్‌సీ, బీసీ కలిపి 1,500 మంది లబ్ధిదారులుంటారని అధికారులు భావిస్తున్నారు.

కొత్త పెన్షన్లతో గిరిజనులకు ఎంతో మేలు

ఇతర ప్రాంతాలతో పోల్చితే గిరిజనులు అత్యంత పేదరికంతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో 50 ఏళ్లు నిండిన గిరిజనులకు వృద్ధాప్య పెన్షన్‌ అందించడం ద్వారా వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేటీకీ గిరిజన ప్రాంతంలో అనేక మంది సొంత భూమి, ఉపాధి అవకాశాలు లేని వృద్ధులున్నారు. ఈ క్రమంలో కొత్త పెన్షన్‌ విధానంతో ఇన్నాళ్లుగా ప్రభుత్వ సాయానికి నోచుకోని అనేక మంది గిరిజనులు వృద్ధాప్య పెన్షన్‌ పొందనున్నారు. అలాగే అర్హులైన పలువురు పెన్షన్‌ లబ్ధిదారులు సైతం ఇప్పటికే అధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. ఈక్రమంలో వారికి సైతం పెన్షన్లు మంజూరయ్యే అవకాశాలున్నాయని అధికారులు అంటున్నారు.

Updated Date - May 23 , 2026 | 11:21 PM