పెన్షనర్ల టెన్షన్
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:50 AM
ప్రభుత్వం విడుదల చేసిన కరువు భత్యం జిల్లాలో వేలాది మంది పింఛన్‌దారులకు అందలేదు. అందుకు సాంకేతిక సమస్య కారణమని చెబుతున్నారు.
14 వేల మంది పింఛన్‌దారులకు అందని డీఏ బకాయిలు
అందరూ సీతమ్మధార సబ్ ట్రెజరీ పరిధిలోని వారే...
సాంకేతిక సమస్య కారణంగా గుర్తింపు
విశాఖపట్నం/సీతమ్మధార, జనవరి 23 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం విడుదల చేసిన కరువు భత్యం జిల్లాలో వేలాది మంది పింఛన్‌దారులకు అందలేదు. అందుకు సాంకేతిక సమస్య కారణమని చెబుతున్నారు. ఖజానా అధికారుల లెక్కల ప్రకారం సీతమ్మధార సబ్‌ట్రెజరీ పరిధిలో సుమారు 14 వేల మంది పింఛన్‌దారులకు కరువుభత్యం బకాయిలు విడుదల కాలేదు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛన్‌దారులకు 2018 సంవత్సరానికి సంబంధించిన రెండు విడతల కరువు భత్యం బకాయిలను సంక్రాంతి ముందు విడుదల చేశారు. అనకాపల్లి, పాడేరు, ఎలమంచిలి, చోడవరం, నర్సీపట్నం సబ్‌ట్రెజరీల పరిధిలోని పింఛన్‌దారులకు బకాయిలు అందాయి. అయితే నగరంలో 14 వేల మందికి మాత్రం అందలేదు. 2018 నాటికి సీతమ్మధార సబ్‌ట్రెజరీ పరిధిలో 14 వేల మంది పింఛనుదారులు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 19 వేలకు పెరిగింది. 2018 సంవత్సరం నాటికి ఉన్న పింఛనుదారులకు ఆ ఏడాది రెండు డీఏలు అందాల్సి ఉంది. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లకు అంటే 2021లో డీఏ బకాయిలు విడుదలకు అనుమతి ఇచ్చినప్పుడు ఉద్యోగులు, పింఛన్‌దారుల బిల్లులు అప్‌లోడ్ చేశారు. ఆ ఏడాది బిల్లులు విడుదల చేయలేదు. అటువంటప్పుడు బిల్లులు మురిగిపోతాయి. అందువల్ల ఏటా పాత బిల్లులు అప్‌లోడ్ చేయాలి. అయితే 2018లో ఒక డీఏ 27 నుంచి 30 శాతానికి, రెండో డీఏ 30 నుంచి 33 శాతానికి పెంచారు. ఈ రెండు విషయాలను ప్రతి ఏడాది రీ అప్‌లోడ్ సమయంలో ప్రత్యేకంగా ప్రస్తావించాలి. విజయవాడలోని ట్రెజరీ ప్రధాన కార్యాలయంలోని సీఎఫ్‌ఎంఎస్ విభాగం దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి ఏడాదీ బిల్లులు పెట్టినప్పుడు సాంకేతిక ఇబ్బందులు లేకుండా సిబ్బంది చూసుకోవాలి. కానీ, ఏం జరిగిందోగానీ సంక్రాంతి పండుగ ముందు అందరికీ బకాయిలు విడుదల చేసినప్పుడు సీతమ్మధార సబ్‌ట్రెజరీ పరిధిలోని పింఛన్‌దారుల ఖాతాలకు జమ కాలేదు. ఒకరిద్దరికి మాత్రమే రాకుంటే అనుమానం వచ్చేది కాదు. ఏకంగా 14 వేల మందికి అందకపోవడంతో పింఛన్‌దారులు పలువురు సబ్‌ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి సంప్రతించగా, మరికొందరు ఫోన్‌లలో ఉన్నతాధికారుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సబ్‌ట్రెజరీ అధికారులు జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వగా, అక్కడ నుంచి విజయవాడలోని ఉన్నతాధికారులకు నివేదించారు. అక్కడ అధికారులు పరిశీలించి, సాంకేతిక సమస్యతో పింఛన్‌దారులకు బకాయిలు జమ కాలేదని నిర్థారించారు. సీఎఫ్‌ఎంఎస్‌లో జరిగిన తలెత్తిన సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. కొద్దిరోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని సీతమ్మధార సబ్‌ట్రెజరీ అధికారులు సమాచారం అందించారని పలువురు పింఛన్‌దారులు వెల్లడించారు.