పెండింగ్ పనులు సకాలంలో పూర్తి
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:26 PM
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516ఈ లో పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ అధికారులను ఆదేశించారు.
హైవే అధికారులకు జేసీ శ్రీపూజ ఆదేశం
నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి
పాడేరు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516ఈ లో పెండింగ్ పనులు సకాలంలో పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి పనులపై శనివారం తన చాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. రెవెన్యూ, అటవీ శాఖలతో సమన్వయం చేసుకుని జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రధాన రహదారితోపాటు బైపాస్ రోడ్డు పనులు సైతం నిర్ణీత గడువులోగా పూర్తికావాలన్నారు. అటవీ అనుమతులకు సంబంధించిన వ్యవహారాలను త్వరితగతిన చేపట్టాలని, నిర్మాణ పనుల్లో నాణ్యతను పాటించాలన్నారు. రోడ్డు నిర్మాణ పనులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, ఏవైనా అడ్డంకులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లాలో నిర్మించిన జాతీయ రహదారితో ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ఎంతో దోహదపడుతుందని, ఈక్రమంలో దానిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.భుజంగరావు, కలెక్టరేట్ డీటీ పోలరాజు, హైవే డీటీ వై.రామ్మూర్తి, హైవే ఇంజనీర్ లోకేశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.