Share News

పాదచారుల ఫ్రెండ్లీ విశాఖ

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:09 AM

పాదచారుల ఫ్రెండ్లీ నగరంగా విశాఖకు గుర్తింపు లభించింది. పాదచారులు నడిచేందుకు వీలైన ఫుట్‌పాత్‌ల వాటా ఆధారంగా 13.4 శాతం వాటాతో ఐదోస్థానం దక్కించుకుంది.

పాదచారుల ఫ్రెండ్లీ విశాఖ

13.4 శాతంతో అనువైన నగరాల జాబితాలో ఐదోస్థానం

వాకర్స్‌ స్వర్గధామంగా బీచ్‌రోడ్డు

పలు పార్కుల్లో వాకింగ్‌ట్రాక్‌లు

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):

పాదచారుల ఫ్రెండ్లీ నగరంగా విశాఖకు గుర్తింపు లభించింది. పాదచారులు నడిచేందుకు వీలైన ఫుట్‌పాత్‌ల వాటా ఆధారంగా 13.4 శాతం వాటాతో ఐదోస్థానం దక్కించుకుంది. పాదచారులు నడిచేందుకు ఎక్కువగా 28 శాతం ఫుట్‌పాత్‌లతో లక్నో ప్రథమస్థానంలో నిలవగా దక్షిణాదిలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ తరువాత విశాఖకు చోటు దక్కింది. దీనికి సంబంధించి ‘న్యూరల్‌ సిటీ స్టేట్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్ట్రీట్స్‌-2026 నివేదిక మేరకు 12 నగరాల్లో పాదచారులు నడవడానికి వీలైన ఫుట్‌పాత్‌ల వాటా ఆధారంగా చేపట్టిన సర్వే వివరాలను తాజాగా ఈ సంస్థ విడుదలచేసింది.

నగరాల్లో 100 మీటర్ల పొడవున పాదచారులు నిరంతరం నడవగలరా? లేదా అనేది ప్రామాణికంగా తీసుకుని సర్వేచేశారు. పాదచారులు నడవడానికి అనువైన రహదారి, మౌలిక సదుపాయాలను సర్వేలో పరిశీలించారు. నగరంలో జీవీఎంసీ చేపట్టిన అభివృద్ధి పనులతో పాదచారులకు అనుకూలంగా మారింది. బీచ్‌ రోడ్డులో ఫుట్‌పాత్‌ కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు పలు ట్రెచ్‌లలో ఉంది. ఉదయం పూట వాకర్లు, బీచ్‌కు వెళ్లే వారు ఫుట్‌పాత్‌లపై నడిచేందుకు అవకాశం ఉంది. దేశంలో మరే నగరానికి లేనంత పొడవైన బీచ్‌రోడ్డు, దానికి ఇరువైపులా ఫుట్‌పాత్‌ సదుపాయం ఉంది. స్మార్ట్‌సిటీ అభివృద్ధిలో భాగంగా సిరిపురం నుంచి బీచ్‌రోడ్డు, వాల్లేర్‌ క్లబ్‌ వెనుక నుంచి ఆలిండియా రేడియో జంక్షన్‌ వరకు ఫుట్‌పాత్‌లు విస్తరించాయి. జాతీయ రహదారి పొడవునా మద్దిలపాలెం నుంచి ఎన్‌ఏడీ వరకు గ్రీన్‌బెల్టులలో వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటుచేశారు. రైల్వేస్టేషన్‌ రోడ్డు, స్టేషన్‌ నుంచి తాటిచెట్లపాలెం జాతీయ రహదారి వరకు ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేశారు.


విచారణ బుట్టదాఖలు?

పెందుర్తి గోదాము బియ్యం కుంభకోణం

పౌరసరఫరాల అధికారులపై ఉన్నత స్థాయి ఒత్తిళ్లు

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి):

పెందుర్తి ఇన్వెస్టర్‌ గోదాములో బియ్యం అక్రమాలపై చేపట్టిన విచారణ బుట్టదాఖలైందని పౌరసరఫరాల సంస్థలో గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ నివేదిక మేరకు చర్యలు లేకుండా సంస్థ అఽధికారులపై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్టు చెబుతున్నారు. సంస్థ ఎండీ పేషీలోని ఓ ఉద్యోగి ఈ వ్యవహారంలో చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యాలయంలో ఎండీలు మారుతున్నా పేషీలో ఆ ఉద్యోగి అక్కడే ఉంటూ మొత్తం వ్యవహారాలు చక్కదిద్దుతున్నారనే వాదన వినిపిస్తోంది. పెందుర్తి గోదాములో బియ్యం వ్యవహారంలో ఈ వ్యక్తి పాత్ర ఉందంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని 36 రైస్‌మిల్లుల నుంచి సీఎంఆర్‌ సుమారు 700 లారీలు (లారీలో సుమారు 29 నుంచి 30 టన్నులు) బియ్యం పెందుర్తి గోదాముకు సరఫరా చేసేందుకు పౌరసరఫరాల సంస్థ అనుమతించింది. కొన్ని లారీలు సీఎంఆర్‌ రైస్‌లో రేషన్‌ బియ్యం కలిపి మిల్లింగ్‌ చేసి, పెందుర్తి గోదాముకు తరలించారు. మరికొన్ని రేషన్‌ బియ్యం లారీలు నేరుగా గోదాముకు తరలించారు. ఈ వ్యవహారంలో రైస్‌మిల్లర్లకు రూ.కోట్లలో లబ్ధి చేకూరింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో గత నెలలో పౌరసరఫరాల సంస్థ కార్యాలయం నుంచి రెండు బృందాలు పెందుర్తి గోదాము నుంచి శ్యాంపిల్స్‌ తీసుకుని లేబ్‌కు పంపారు.

గోదాములోకి వచ్చే బియ్యం నాణ్యతను నిర్ధారించాల్సిన గోదాము యజమాని తరఫున ఉద్యోగి, పౌరసరఫరాల సంస్థ టెక్నికల్‌ అధికారులు, మిల్లర్లతో లాలూచీ పడ్డారనే ఆరోపణలున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పౌరసరఫరాల సంస్థ కార్యాలయాల పరిధిలో పెందుర్తి గోదాము నడుస్తోంది. అంటే గోదాములోకి వచ్చే ప్రతి గింజ నాణ్యతకు ఇద్దరు డీఎంలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ అక్కడ టెక్నికల్‌ అధికారులదే బాధ్యతని తమ తప్పులేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. చివరకు ఎండీ ఆదేశాలలో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం నుంచి గోదాముకు రైస్‌ తరలించే మిల్లర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై మిల్లర్లు ఇంకా సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రజలకు ఇచ్చే రేషన్‌ బియ్యం సీఎంఆర్‌ రైస్‌లో కలిపిన విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. రెండు బృందాలు పెందుర్తి గోదాములో తనిఖీల అనంతరం ఇచ్చిన నివేదిక మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా పైనుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారుల స్పందించి వాస్తవాలు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2026 | 01:09 AM