వేరుశనగతో సిరులు
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:23 PM
మన్యంలో వేరుశనగ పంట గిరిజన రైతులకు లాభాలు కురిపిస్తున్నది. దీంతో వేరుశనగ సాగు చేసేందుకు గిరిజన రైతులు ఆసక్తి చూపుతుండడంతో విస్తీర్ణం అనూహ్యంగా పెరుగుతోంది.
గిరిజన రైతులు ఆసక్తి
నాలుగేళ్లలో 440 హెక్టార్ల నుంచి
4 వేల హెక్టార్లకు పెరిగిన సాగు విస్తీర్ణం
మూడు నెలల్లో ఎకరం సాగుతో రూ.10 వేలు ఆదాయం
అధికారులు ప్రోత్సహిస్తే రైతుకు మరింత ప్రయోజనం
(పాడేరు-ఆంధ్రజ్యోతి)
గిరిజన ప్రాంతంలో గతంలో వేరుశనగ పంట ఉండేది కాదు. చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో జీకేవీధి, చింతపల్లి మండలాల్లో కొంతమంది రైతులు మాత్రమే వేరుశనగను పండించేవారు. క్రమంగా ఏజెన్సీలో అన్ని మండలాల్లోనూ గిరి రైతులు వేరుశనగను పండించడం మొదలుపెట్టారు. ఈ పంట వేయడంతో రైతులకు అధిక ఆదాయం వస్తుండడంతో నాలుగేళ్లలో విస్తీర్ణం అనూహ్యంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితం వరకు ఏజెన్సీలో కేవలం 440 ఎకరాల విస్తీర్ణంలో ఉండే వేరుశనగ పంట ప్రస్తుతం 4 వేల ఎకరాలకు పెరిగింది. తక్కువ కాలంలో పంట చేతికి రావడంతోపాటు ఎక్కువ శ్రమ, పెట్టుబడి లేని కారణంగా గిరి రైతులు వేరుశనగ పంటపై ఆసక్తి చూపుతున్నారని వ్యవసాయాధికారులు అంటున్నారు. వేరుశనగ పంటలో బంతి, మొక్కజొన్న వంటి వాటిని అంతర పంటలుగా వేస్తున్నారు. దీంతో ఏకకాలంలో రెండు పంటలు దిగుబడి వచ్చి రైతులకు చక్కని ఆదాయం లభిస్తున్నది. ప్రస్తుతం ఏజెన్సీలో పాడేరు, హుకుంపేట, జి.మాడుగుల, డుంబ్రిగుడ, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో అధిక విస్తీర్ణంలో వేరుశనగను పండిస్తున్నారు. గిరిజనులు స్థానికంగా జరిగే వారపు సంతల్లోనే బస్తాల చొప్పున వర్తకులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో 50 కిలోల బస్తా రూ.2 వేలు ధరకు వర్తకులు కొనుగోలు చేస్తున్నారు.
ఎకరం సాగుకు ఖర్చు రూ.వెయ్యే..
ఏజెన్సీలో ఎకరం భూమిలో వేరుశనగ పంటను పండించేందుకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే వ్యయం అవుతుందని రైతులు తెలిపారు. ఒక గిరిజన కుటుంబం తమ సొంత పనిగా ఎకరం భూమిని దున్ని చదును చేసుకుంటారు. కిలో రూ.80లకు లభిస్తున్న హైబ్రీడ్ రకం విత్తనాలను ఎకరానికి పది కిలోలు చొప్పున వేస్తున్నారు. అలాగే 90 రోజుల్లో దిగుబడి వచ్చే ఈ పంటకు ఎటువంటి ఎరువులు, క్రిమిసంహార మందులు వినియోగించడం లేదు. కాని పంట కాలంలో ఒకమారు కలుపుతీసి, గొప్పు తవ్వేతే చాలు. ఎకరం విస్తీర్ణంలో పంటకు ఆరు బస్తాలు (బస్తా 50 కిలోలు మాత్రమే) కాయలు దిగుబడి వస్తున్నాయి. ఈ లెక్కన బస్తా రూ.2 వేలు ధర ప్రస్తుతం ఉన్నప్పటికీ, ధర అటూ ఇటూ ఉన్నా.. కచ్చితంగా రూ.10 వేలు తగ్గకుండా ఆదాయం వస్తుందని పాడేరు మండలం జామిగుడ గ్రామానికి చెందిన పాంగి సుబ్బారావు తెలిపారు. ఒక గిరిజన కుటుంబం ఎకరం విస్తీర్ణంలో వేరుశనగను పండించేందుకు తమ కష్టంతోపాటు రూ.వెయ్యి వరకు వ్యయం చేస్తే.. 90 రోజుల్లో రూ.10 వేలు తగ్గకుండా ఆదాయం పొందవచ్చునని అంటున్నారు. ఏజెన్సీలో సాగు చేస్తున్న గిరిజన రైతులకు మేలురకం విత్తనాలు అందించి, వ్యవసాయ, ఉద్యానవనాధికారులు సలహాలు, సూచనలు అందించి ప్రోత్సహిస్తే తమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు.
ఏజెన్సీలో గత ఐదేళ్లలో వేరుశనగ సాగు విస్తీర్ణం
2022 వరకు 440 హెక్టార్లు
2023లో 1,570 హెక్టార్లు
2024లో 1,791 హెక్టార్లు
2025లో 2,749 హెక్టార్లు
2026లో 4,128 హెక్టార్లు