యోగాతో మానసిక ప్రశాంతత
ABN , Publish Date - Jun 22 , 2026 | 01:21 AM
యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు.
ఒత్తిడి లేని జీవితానికి దోహదం
కలెక్టర్ విజయకృష్ణన్
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
తుమ్మపాల (అనకాపల్లి), జూన్ 21 (ఆంధ్రజ్యోతి):
యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బొజ్జన్నకొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర-2026 కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత అందరితో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, యోగాతో మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం సాధ్యమవుతుందన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు శారీరక శ్రమ బాగా తగ్గిందని, అధునాతనమైన సౌకర్యాలు అందుబాటులోకి రావడమే ఇందుకు కారణమని అన్నారు. శారీరక శ్రమ తగ్గడంతోపాటు మరోవైపు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని అధిగమించి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యాంత్రీక జీవన విధానంలో పరుగులు పెడుతున్నప్పటికీ ప్రతిరోజు కనీసం ఒక అరగంట సమయం యోగా సాధన కోసం కేటాయించాలని సూచించారు.
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, పాఠశాలల్లో యోగాను విధిగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనున్నామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు యోగా సాధన చేసేలా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం యోగాసనాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, పలు శాఖల అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు.
ఘనంగా యోగా దినోత్సవం
యోగా వేడుకలను జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థలు, క్రీడా మైదానాల్లో ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో భారత స్వాభిమాన్ ట్రస్టు యోగా గురువు భీశెట్టి దొరమ్మనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో పలువురు పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి వివరించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మేనేజర్ కె.రామకృష్ణ, యోగా గురువు కె.సూర్యనారాయణ ఆధ్వర్యంలో యోగా వేడుకలు నిర్వహించారు. అనకాపల్లి కోర్టు సముదాయంలో నిర్వహించిన యోగా వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.