Share News

జడ్పీ పీఠంపై వంతాల శాంతి

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:32 AM

జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రశాంతంగా జరిగింది. చైర్‌పర్సన్‌గా పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతి, వైస్‌ చైర్మన్‌గా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు ఎన్నికయ్యారు.

జడ్పీ పీఠంపై వంతాల శాంతి
జడ్పీ చైర్‌పర్సన్‌ వంతాల శాంతికి అభినందనలు తెలుపుతున్న కలెక్టర్‌ టి.నిషాంతి

వైస్‌ చైర్మన్‌గా సీదరి రాంబాబు

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ

పాడేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రశాంతంగా జరిగింది. చైర్‌పర్సన్‌గా పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతి, వైస్‌ చైర్మన్‌గా పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబు ఎన్నికయ్యారు. జిల్లాలో మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు వైసీపీ 7, టీడీపీ 3, సీపీఎం 1 స్థానం గెలుచుకున్న సంగతి తెలిసిందే. కూటమికి తగినన్ని జడ్పీటీసీ స్థానాలు దక్కడపోవడంతో మిన్నకున్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి శుక్రవారం జడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికను నిర్వహించారు. పెదబయలు జడ్పీటీసీ సభ్యురాలు వంతాల శాంతిని చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా అనంతగిరి జడ్పీటీసీ సభ్యురాలు డూరు జయవర్థిని, జీకేవీధి జడ్పీటీసీ సభ్యుడు కంకిపాటి గిరిప్రసాద్‌ ప్రతిపాదించగా, మిగిలిన వైసీపీ జడ్పీటీసీ సభ్యులు ఒంటూరు ప్రియాంక, కోరాబు అనుషా, సీదరి రాంబాబు, కిముడు హరి మద్దతు తెలపడంతో వంతాల శాంతిని చైర్సపర్సన్‌గా ఎన్నికైనట్టు కలెక్టర్‌ నిషాంతి ప్రకటించారు. అనంతరం పాడేరు జడ్పీటీసీ సభ్యుడు సీదరి రాంబాబును వైస్‌ చైర్మన్‌గా డుంబ్రిగుడ జడ్పీటీసీ సభ్యుడు కిముడు హరి ప్రతిపాదించగా, హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు ఒంటూబు ప్రియాంక బలపరిచారు. మిగిలిన సభ్యులు మద్దతు తెలపడంతో వైస్‌చైర్మన్‌గా రాంబాబు ఎన్నికైనట్టు కలెక్టర్‌ ప్రకటించి, ధ్రువీకరణ పత్రాలు అందించారు. జడ్పీ ఎన్నికకు టీడీపీ జడ్పీటీసీ సభ్యులు పెట్టెలి దాసుబాబు(అరకులోయ), సోమెలి అఖిల (జి.మాడుగుల), మొట్టడం హిమబిందు(కొయ్యూరు), సీపీఎం జడ్పీటీసీ సభ్యుడు కొర్రా త్రినాథ్‌ (ముంచంగిపుట్టు) హాజరయ్యారు. తొలుత జడ్పీటీసీ సభ్యులతో కలెక్టర్‌ నిషాంతి ప్రమాణస్వీకారం చేయించారు. జడ్పీ ఎన్నికను జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి కూర్మనాథ్‌ పరిశీలించారు. ఈ ఎన్నికకు అరకులోయ ఎంపీ డాక్టర్‌ తనూజారాణి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పాడేరు, అరకులోయలో ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్‌ సీఈవో పి.వాసుదేవరావు, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, తదితరులు హాజరయ్యారు.

Updated Date - Nov 21 , 2026 | 12:32 AM