కాలుష్యంపై పీసీబీ సీరియస్
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:37 AM
నగరంలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమైన పలు పారిశ్రామిక సంస్థలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణమండలి కొరడా ఝుళిపించింది.
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు రూ.16.32 కోట్లు జరిమానా
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమైన పలు పారిశ్రామిక సంస్థలపై రాష్ట్ర కాలుష్య నియంత్రణమండలి కొరడా ఝుళిపించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత వాయు ప్రమాణాలు, కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా నగరంలో వాయు కాలుష్యం పెరిగేందుకు కారణమైన ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక సంస్థలకు రూ.16.32 కోట్ల పర్యావరణ పరిహారం (జరిమానా) విధించింది.
ఇటీవల కాలంలో ఇంత పెద్దమొత్తంలో పర్యావరణ పరిహారం విధించడం ఇదే తొలిసారని చెబుతున్నారు. గత ఏడాది డిసెంబరులో నగరంలో వాయు కాలుష్యం పరిమితికి మించి పెరిగిన నేపథ్యంలో కొన్ని పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, పొగ కారణంగా వాయునాణ్యతపై ప్రతికూల ప్రభావం పడినట్టు పీసీబీ అధికారులు గుర్తించారు. దీంతో గత ఏడాది డిసెంబరు, ఈ ఏడాది జనవరిలో నగరంలో విశాఖ పోర్టులో పలు కార్గో హ్యాండ్లింగ్ కంపెనీలు, కోరమాండల్, ఆర్సీఎల్, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ సంస్థలను తనిఖీ చేసి ఉల్లంఘనలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ప్రథమార్థంలో ఆయా సంస్థలకు పర్యావరణ పరిహారం చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై వివరణ ఇచ్చిన సంస్థలు తదుపరి కాలుష్యం తీవ్రతకు తగ్గించడంలో విఫలమైనట్టు కాలుష్య నియంత్రణమండలి గుర్తించింది.
తీవ్రత గుర్తించి చర్యలు
పరిమితికి మించి వాయు కాలుష్యం సూచీలు నమోదు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన పీసీబీ, ఆయా సంస్థలకు రూ.16.32 కోట్ల పర్యావరణ పరిహారం విధించింది. ఈ నేపథ్యంలో నగరంలో వాయు కాలుష్యం తగ్గించేలా ఆయా సంస్థలు అన్ని చర్యలు తీసుకోవాలని ఏపీ పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య సూచించారు. గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి నగరంలో ఎనిమిది మాన్యువల్, మూడు ఆన్‌లైన్ యంత్రాలు పనిచేస్తున్నాయన్నారు. వచ్చేనెల ఐదోతేదీ నాటికి ఐవోటీ సెన్సార్ బేస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.