Share News

వేదాంతకు పీసీబీ చెక్‌

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:20 AM

పోర్టు ద్వారా బాక్సైట్‌ దిగుమతి చేసుకుంటున్న వేదాంత సంస్థపై కాలుష్య నియంత్రణ మండలి పలు ఆంక్షలు విధించింది. రోజంతా బాక్సైట్‌ దిగుమతికి అనుమతి నిరాకరించిన అధికారులు...అందుకు నిర్ణీత సమయం కేటాయించారు. గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల ఆరేడు తేదీల వరకు బాక్సైట్‌ దిగుమతి సమయంలో ధూళి రేగడంతో వన్‌టౌన్‌ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు.

వేదాంతకు పీసీబీ చెక్‌
కోట వీధి వెనుక వేదాంత కన్వేయర్‌ బెల్టు నుంచి ధూళి రాకుండా గ్రీన్‌ మెస్‌ ఏర్పాటుచేసిన దృశ్యం

బాక్సైట్‌ దిగుమతిలో ఆంక్షలు

నిర్ణీత సమయంలోనే అనుమతి

కన్వేయర్‌ బెల్టుకు

పలుచోట్ల గ్రీన్‌ మెస్‌ ఏర్పాటు

విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):

పోర్టు ద్వారా బాక్సైట్‌ దిగుమతి చేసుకుంటున్న వేదాంత సంస్థపై కాలుష్య నియంత్రణ మండలి పలు ఆంక్షలు విధించింది. రోజంతా బాక్సైట్‌ దిగుమతికి అనుమతి నిరాకరించిన అధికారులు...అందుకు నిర్ణీత సమయం కేటాయించారు. గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల ఆరేడు తేదీల వరకు బాక్సైట్‌ దిగుమతి సమయంలో ధూళి రేగడంతో వన్‌టౌన్‌ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. దీనిపై ఆందోళన చేసినా వేదాంత సంస్థ పట్టించుకోవడంతో జిల్లా అధికారులు, ఎంపీ ఎం.శ్రీభరత్‌, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, కాలుష్య నియంత్రణ మండలికి స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు రావడంతో పీసీబీ అధికారులు వన్‌టౌన్‌లో కోట వీధి, చిలకపేట, ఇతర వీధులను తనిఖీచేసి ధూళి ఉన్నట్టు నిర్ధారించారు. వెంటనే వేదాంత సంస్థకు నోటీస్‌ జారీచేశారు. అదే సమయంలో కాలుష్యంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన పీసీబీ చైర్మన్‌ కృష్ణయ్య...పోర్టు, ఇతర పరిశ్రమల ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పీసీబీ అధికారులు వేదాంత బెర్తు నుంచి యార్డు వరకు ఉన్న కన్వేయర్‌ బెల్టును పరిశీలించారు. ఆ బెల్టుకు అక్కడక్కడా లీకులు (రంధ్రాలు) ఉన్నట్టు గుర్తించిన అధికారులు వెంటనే బాక్సైట్‌ దిగుమతిని నిలిపివేయాలని ఆదేశించారు. కన్వేయర్‌ బెల్టులో లీకులు ఉన్నచోట గ్రీన్‌ మెస్‌లు ఏర్పాటుచేయించారు. అదేవిధంగా నౌక నుంచి సరుకు దిగుమతికి రోజులో కొన్ని గంటలపాటు మాత్రమే అనుమతి ఇచ్చారు. దిగుమతి సమయంలో ధూళి రేగితే వెంటనే నిలుపుదల చేయాలని ఆదేశించినట్టు పీసీబీ ఈఈ పీవీ ముకుందరావు పేర్కొన్నారు. బాక్సైట్‌ దిగుమతి పూర్తయ్యేంత వరకు పీసీబీ ఉద్యోగి ఒకరు బెర్తు నుంచి యార్డు మధ్య ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు.

కాగా వేదాంత బెర్త్‌ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యార్డుకు బొగ్గు, జిప్సం, బాక్సైట్‌ వంటి వాటిని కన్వేయర్‌ బెల్టు ద్వారా తరలిస్తుంటారు. బాక్సైట్‌తో గత ఏడాది సెప్టెంబరులో ఓ నౌక, జూన్‌ నెలాఖరున మరో నౌక వచ్చాయి.

Updated Date - Jul 16 , 2026 | 01:20 AM