నేడు పాడేరుకు పవన్‌కల్యాణ్
ABN , Publish Date - Mar 13 , 2026 | 10:32 PM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లా పర్యటనకు పాడేరు రానున్నారు.
విశాఖ నుంచి హెలికాఫ్టర్‌లో రాక
నందిగరువు గ్రామానికి కాలినడకన వెళ్లనున్న డిప్యూటీ సీఎం
రహదారి పనుల్లో నాణ్యత పరిశీలన
ఆదిమజాతి గిరిజనులతో ముచ్చటించనున్న పవన్‌కల్యాణ్
మీడియాకు నో ఎంట్రీ
పాడేరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ శుక్రవారం ఉదయం అల్లూరి జిల్లా పర్యటనకు పాడేరు రానున్నారు. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంట్లమామిడి పంచాయతీ నందిగరువు గ్రామంలో నివసిస్తున్న ఆదిమ జాతి గిరిజనులతో ముచ్చటించనున్నారు. ప్రధానమంత్రి గ్రామసడక్ యోజనలో రూ.1.7 కోట్లతో ఆ గ్రామానికి నిర్మించిన రోడ్డును పరిశీలించనున్నారు. మార్గమధ్యలో పలువురు గిరిజనులతో రెండు నిమిషాలు ముచ్చటిస్తారు. అనంతరం నందిగరువు గ్రామస్థులతో పవన్‌కల్యాణ్ మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
నందిగరువు గ్రామం ప్రొఫైల్
పాడేరు మండలం వంట్లమామిడి పంచాయతీ నందిగరువు గ్రామంలో 50 ఆదిమ జాతి గిరిజన కుటుంబాలు ఉన్నాయి. వారిలో పురుషులు 103 మంది, మహిళలు 110 మంది ఉండగా, బడికి వెళుతున్న బాలలు 23 మంది, అంగన్‌వాడీ బాలలు 31 మంది ఉన్నారు. వారిలో 198 మంది రైతులు కాగా 16 మంది ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పొందుతున్నారు.
డిప్యూటీ సీఎం పర్యటన వివరాలు
విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం పది గంటలకు పాడేరు మండలం లగిశపల్లిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో పదిన్నర గంటలకు ఓనూరు జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నందిగరువు గ్రామానికి కాలినడకన చేరుకుంటారు. ఆ గ్రామంలో గంట సేపు గిరిజనులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో లగిశపల్లిలోని హెలిప్యాడ్‌కు చేరుకుని రెండున్నర గంటలకు హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం తిరుగు ప్రయాణమవుతారు.
మీడియాకు నో ఎంట్రీ
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటనను కవర్ చేసేందుకు మీడియాకు అనుమతి ఇవ్వలేదు. ఆయన పాడేరు రాక మొదలుకుని, ఓనూరు జంక్షన్, నందిగరువు కార్యక్రమాలు ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో వెళ్లే ఏ కార్యక్రమానికి మీడియాకు అనుమతించలేదు. డిప్యూటీ సీఎంకు సంబంధించిన బృందమే ప్రత్యేకంగా ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు విడుదల చేస్తారని, ఏ కార్యక్రమానికి మీడియాకు ఎంట్రీ లేదని అధికారులు పేర్కొన్నారు.