పట్టాలెక్కని మెట్రో రైలు ప్రాజెక్టు!
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:27 AM
విశాఖపట్నానికి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిపాదించి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఎటువంటి కదలిక లేదు. ఎప్పటికి పనులు ప్రారంభమవుతాయో తెలియదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా ఆమోదం పొందలేదు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ దీనిపై సంయుక్త సర్వే నిర్వహిస్తుండడం గమనార్హం.
ప్రతిపాదనకు పదేళ్లు పూర్తి
ఇంకా ఆమోదం పొందని డీపీఆర్
డబుల్ డెక్కర్ విధానాన్ని
తిరస్కరించిన కేంద్రం
మళ్లీ సర్వే
భూసేకరణ వ్యయం రూ.882 కోట్ల నుంచి రూ.600కు తగ్గింపు
టీడీఆర్‌లు కాకుండా డబ్బులు ఇస్తేనే భూములు ఇస్తామంటున్న యజమానులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నానికి మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిపాదించి పదేళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ ఎటువంటి కదలిక లేదు. ఎప్పటికి పనులు ప్రారంభమవుతాయో తెలియదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కూడా ఆమోదం పొందలేదు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ దీనిపై సంయుక్త సర్వే నిర్వహిస్తుండడం గమనార్హం.
హైదరాబాద్ వంటి నగరాలకే మెట్రో రైలు ప్రాజెక్టు ఆర్థికంగా వెసులుబాటు కాలేదు. కానీ విశాఖపట్నంలో దానిని పట్టుబట్టి మరీ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో కష్టమని పాలకులు చెబుతున్నారు. ఇది అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు. నిర్మాణానికి కిలోమీటరుకు భూమితో కలిసి రూ.300 కోట్లు వ్యయం అవుతుందని ఐదేళ్ల క్రితం లెక్కలు వేశారు.
విశాఖలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టుకు 99.75 ఎకరాల భూమి అవసరమని నిర్ధారించారు. అందులో రూ.9.5 ఎకరాలు ప్రైవేటు భూమి ఉంది. అవన్నీ తాటిచెట్లపాలెం, చినవాల్తేరు వంటి జనసమ్మర్థమైన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ భూ యజమానులకు సుమారు రూ.882 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంటుందని మొదట్లోనే గణాంకాలు వేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో రెండు ఎకరాలు తగ్గించి 7.5 ఎకరాల ప్రైవేటు భూమితో సరిపెట్టుకోవాలని తాజాగా నిర్ణయించారు. వీరికి రూ.600 కోట్లు పరిహారంగా ఇవ్వాలి. రహదారుల నిర్మాణానికి టీడీఆర్‌లు ఇచ్చినట్టు తమకూ ఇస్తామంటే భూములు ఇవ్వబోమని, నగదు ఇవ్వాల్సిందేనని వారు స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తొలుత రూ.600 కోట్లు మంజూరుచేయాలి. అప్పుడే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభమవుతాయి. భూసేకరణ, ట్రాక్ అలైన్‌మెంట్, డిజైనింగ్ వంటివి ఒకదాని తరువాత మరొకటి చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించే భూముల్లో మెట్రో రైలు స్టేషన్లకు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకే ఆ భూములు ఈ ప్రాజెక్టులో కీలకంగా మారాయి.
డబుల్ డెక్కర్ విధానంపై కేంద్రం విముఖం
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు జాతీయ రహదారి-16 మీదుగా వెళుతుంది. దీనిని దశల వారీగా భోగాపురం విమానాశ్రయానికి కనెక్ట్ చేయాలనేది ఆలోచన. ఈ మార్గంలో వాహనాల రద్దీ చాలా ఎక్కువ. నగర పరిధిలో 12 చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని గతంలో ప్రతిపాదించగా నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదించింది. కూటమి ప్రభుత్వం ఫ్లైఓవర్లు తీసేసి డబుల్ డెక్కర్ విధానం ప్రతిపాదించింది. కిందన వాహనాల కోసం నాలుగు వరుసలతో ఫ్లైఓవర్ రహదారి, దానిపై మెట్రో రైలు నడిచేలా డిజైన్ చేసింది. దీనిని కేంద్రానికి సమర్పిస్తే తిరస్కరించింది. దేశంలో ఎక్కడా ఇలాంటి మోడల్ లేదని, మెట్రో రైలుతో ప్రయోగాలు చేయవద్దని సూచించింది. రివైజ్డ్ డీపీఆర్ పంపాలని కోరారు. దీని కోసం ఇప్పుడు మళ్లీ ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్‌హెచ్‌ఏఐ కలిసి సంయుక్త సర్వే చేపట్టాలని నిర్ణయించాయి. ఈలోగా ప్రాథమికంగా పనులు ప్రారంభించేందుకు భూ సేకరణకు అవసరమైన రూ.600 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీఎంఆర్‌సీఎల్ కోరింది. ఈ నిధులు విడుదలైనప్పుడు, కేంద్రం కొత్త డీపీఆర్‌కు ఆమోదం తెలిపినప్పుడే ఈ ప్రాజెక్టు ముందుకు కదులుతుంది.