పట్నం పల్లెటూరు
ABN , Publish Date - Jan 15 , 2026 | 01:19 AM
నిత్యం రద్దీగా కనిపించే నగరం బుధవారం బోసిపోయింది. నగరవాసుల్లో అత్యధికులు సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లడంతో ప్రధాన రోడ్లు, కూడళ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఊళ్లో ఉన్నవారు సాయంత్రం బీచ్‌కు వెళ్లడంతో...అక్కడ కాస్త సందడి కనిపించింది.
పండుగకు స్వస్థలాలకు నగరవాసులు
నిర్మానుష్యంగా మారిన రహదారులు
ఖాళీగా దర్శనమిచ్చిన కూడళ్లు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నిత్యం రద్దీగా కనిపించే నగరం బుధవారం బోసిపోయింది. నగరవాసుల్లో అత్యధికులు సంక్రాంతి పండుగ కోసం స్వస్థలాలకు వెళ్లడంతో ప్రధాన రోడ్లు, కూడళ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఊళ్లో ఉన్నవారు సాయంత్రం బీచ్‌కు వెళ్లడంతో...అక్కడ కాస్త సందడి కనిపించింది.
ఉద్యోగ, ఉపాధి, విద్య కోసం ఎక్కడెక్కడో స్థిరపడినవారు సంకాంత్రి పండుగకు తమ స్వస్థలాలకు వెళ్లి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నగరంలో నివసిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్రతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల చెందినవారు ఉన్నారు. ఏడాదంతా ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాల్లో బిజీగా గడిపిన వారంతా సంక్రాంతికి మాత్రం తప్పనిసరిగా తమ స్వస్థలాలకు వెళుతుంటారు. విద్యా సంస్థలకు ప్రభుత్వం 11 నుంచి సెలవులు ప్రకటించడంతో చాలామంది అప్పుడే ప్రయాణమయ్యారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారు, వ్యాపారులు, కూలిపనులు చేసుకునేవారు ముందుగా వెళ్లిపోయేందుకు అవకాశం ఉండదు కాబట్టి..మంగళవారం, మరికొందరు బుధవారం ఉదయం భోగి పండుగను జరుపుకుని తమ స్వస్థలాలకు పయనమయ్యారు. దీనివల్ల బుధవారం మధ్యాహ్నం వరకూ అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే రహదారుల్లో కొంత వాహనాల రద్దీ కనిపించినా తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. నిత్యం వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్‌తో పద్మవ్యూహాన్ని తలపించే హనుమంతవాక కూడలి, వెంకోజీపాలెం, ఇసుకతోట, ఎంవీపీ కాలనీ, సత్యం జంక్షన్, ద్వారకా నగర్, జగదాంబ జంక్షన్, ద్వారకా ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నిర్మానుష్యంగా కనిపించాయి. వాహనాల రాకపోకలు తగ్గిపోవడంతో ప్రధాన రహదారులు కూడా ఖాళీగా కనిపించాయి. సెలవు రోజుల్లో సందర్శకులతో కోలాహలంగా ఉండే బీచ్, జూపార్క్ కూడా వెలవెలబోయాయి. ఊరెళ్లకుండా నగరంలోనే ఉండిపోయినవారు మాత్రం సాయంత్రం ఆర్కే బీచ్‌కు వెళ్లి గాలిపటాలు ఎగరవేస్తూ కాలక్షేపం చేశారు. గోకుల్ పార్కు వద్ద మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. సంకాంత్రి, కనుమ పండుగలను జరుపుకున్న తర్వాత శనివారం నుంచి తిరిగి నగరానికి ప్రయాణాలు మొదలవుతాయి. సోమవారం నాటికి నగరంలో యథాస్థితి కనిపించే అవకాశం ఉంది.