Share News

డయాలసిస్‌ యూనిట్‌కు రోగుల తాకిడి

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:20 PM

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్‌ యూనిట్‌కు రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో యూనిట్‌లోని మంచాలు సరిపోవడం లేదు.

డయాలసిస్‌ యూనిట్‌కు రోగుల తాకిడి
నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో డయాలసిస్‌ యూనిట్‌లో కిడ్నీ రోగులు

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పదేళ్ల క్రితం 21 మంచాలతో యూనిట్‌ ఏర్పాటు

ఏటా రోగుల సంఖ్య పెరుగుతుండడంతో సరిపోని మంచాలు

మూడు సెషన్స్‌లో పని చేయాల్సిన యూనిట్‌ నాలుగో సెషన్‌లో కూడా సేవలు

యూనిట్‌ను విస్తరించాలని రోగుల వేడుకోలు

నర్సీపట్నం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలోని డయాలసిస్‌ యూనిట్‌కు రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో యూనిట్‌లోని మంచాలు సరిపోవడం లేదు. మూడు సెషన్స్‌లో పని చేయాల్సిన యూనిట్‌ నాలుగో సెషన్‌లో కూడా డయాలసిస్‌ సేవలు అందించాల్సి వస్తున్నది. దూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు, వారితో వచ్చిన సహాయకులు రాత్రి వరకు ఉండిపోవాల్సి వస్తున్నది.

నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో 2016లో అయ్యన్నపాత్రుడు చొరవ వల్ల గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 21 మంచాలతో డయాలసిస్‌ క్లినిక్‌ యూనిట్‌ పెట్టారు. జిల్లాలో ఇదే అతి పెద్ద డయాలసిస్‌ యూనిట్‌. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో నెఫ్రో ప్లస్‌కి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజులు ఈ యూనిట్‌లో సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ప్రతీ నెలా మొదటి, మూడో గురువారం నెఫ్రాలజిస్ట్‌ (మూత్ర పిండాల స్పెషలిస్ట్‌) వస్తుంటారు. ఇటీవల మెడికల్‌ ఆఫీసర్‌ను నియమించారు. డయాలసిస్‌ చేసినందుకు ఒక సెషన్‌కి రూ.1,113 చొప్పున నెఫ్రో ప్లస్‌కి ప్రభుత్వం చెల్లిస్తున్నది. జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నంలో మాత్రమే డయాలసిస్‌ క్లినిక్‌లు ఉన్నాయి. నర్సీపట్నంలో 21 మంచాలు ఉంటే, అనకాపల్లి డయాలసిస్‌ క్లినిక్‌లో 4 మంచాలు మాత్రమే ఉన్నాయి.

ఏటా పెరుగుతున్న రోగుల సంఖ్య

మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతుండడం వలన ఇక్కడ డయాలసిస్‌ యూనిట్‌ సరిపోవడం లేదు. ఇక్కడ యూనిట్‌లో ఒక సెషన్‌కి 21 మంది చొప్పున మూడు సెషన్స్‌లో 63 మందికి సేవలు అందిస్తున్నప్పటికీ నాలుగో సెషన్‌కి కూడా రోగులు ఉంటున్నారు. ఒకసారి డయాలసిస్‌ చేయాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది. దీని వలన దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు రాత్రి 9 గంటలు దాటే వరకు ఉండిపోవలసి వస్తున్నది. నర్సీపట్నం చుట్టుపక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో రోగులు ఇక్కడకు వస్తున్నారు. కొయ్యూరు, గొలుగొండ మండలాల నుంచి డయాలసిస్‌కి వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో నర్సీపట్నంలోని డయాలసిస్‌ క్లినిక్‌ను విస్తరించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:20 PM