Share News

నిర్మాణ్‌తో విద్యార్థుల భవితకు బాటలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:43 PM

ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు ‘నిర్మాణ్‌’ కార్యక్రమం ద్వారా చక్కని బాటలు వేస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

నిర్మాణ్‌తో విద్యార్థుల భవితకు బాటలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

నీతి అయోగ్‌ ప్రతినిధుల సమావేశఽంలో కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామని వెల్లడి

పాడేరు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు ‘నిర్మాణ్‌’ కార్యక్రమం ద్వారా చక్కని బాటలు వేస్తున్నామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. విశాఖపట్నంలో సోమవారం నిర్వహించిన నీతి అయోగ్‌ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థుల విద్యాప్రమాణాలను మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం నిర్మాణ్‌ పేరిట సమగ్ర విద్యా వ్యూహాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలోని భౌగోళిక, సామాజిక, విద్యాపరమైన సమస్యలను గుర్తించామన్నారు. ఈ క్రమంలో గిరిజన విద్యకు పటిష్ట పునాది వేయాలనే లక్ష్యంతో ఎఫ్‌ఎల్‌ఎన్‌(ఫౌండేషన్‌ లిటరసీ న్యూమరేషన్‌), టీఏఆర్‌ఎల్‌(టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవల్‌)వంటి ప్రత్యేక ప్రక్రియలతో 3 నుంచి పదవ తరగతి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచుతున్నామన్నారు. ఇందుకు గాను ముందుగా 21 మాడ్యూళ్లలో ఆరు వేల మంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ అందించి, మూడు వేల పాఠశాలలకు చెందిన లక్షా 40 వేల మంది విద్యార్థులకు సమగ్ర విద్యా వ్యూహాన్ని అమలు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థుల కోసం సూపర్‌- 50 పేరిట అమలు చేస్తున్న ప్రత్యేక బోధనా తరగతులు సైతం శత శాతం ఫలితాలిస్తున్నాయని కలెక్టర్‌ వివరించారు. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మార్గదర్శి పేరిట కెరీర్‌ గైడెన్స్‌ అందిస్తున్నామన్నారు. అలాగే 2025- 26 విద్యాసంవత్సరంలో భాగంగా గతేడాది జూన్‌ నెలలో నిర్వహించిన బేస్‌లైన్‌ టెస్ట్‌లో విద్యలో వెనుకబాటులో ఉన్న విద్యార్థులను గుర్తించి, ఆ సమస్యను అధిగమిస్తున్నామన్నారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ, నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో అనేక ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Mar 09 , 2026 | 11:43 PM