Share News

ట్రెక్కింగ్‌కు రూట్‌ క్లియర్‌

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:03 AM

ఎత్తైన పచ్చని కొండలు, ఆహ్లాదకర వాతావరణం, జలపాతం అందాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌ చేయడానికి అటవీ శాఖ మార్గాన్ని ఖరారు చేసింది. మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాక నుంచి మర్దగూడ ఎకో పార్కు వరకు సుమారు 24 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయడానికి రూట్‌ను ఫైనల్‌ చేసింది. ట్రెక్కర్స్‌ మార్గమధ్యంలో సేదతీరేందుకు హోమ్‌ స్టే ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ట్రెక్కింగ్‌కు రూట్‌ క్లియర్‌
కొండల పైనుంచి ట్రెక్కింగ్‌ చేసుకుంటూ వెళుతున్న అటవీశాఖ సిబ్బంది (ఫైల్‌

- ప్రకృతి అందాలు, జలపాతాల హోయలు వీక్షించేలా మార్గం ఎంపిక

- రాజుపాక నుంచి మర్దగూడ వరకు 24 కిలోమీటర్ల మేర రూటు ఫైనల్‌

- ట్రెక్కర్స్‌ విశ్రాంతి తీసుకునేలా హోమ్‌ స్టేకు ఏర్పాట్లు

(అనంతగిరి- ఆంధ్రజ్యోతి)

ఎత్తైన పచ్చని కొండలు, ఆహ్లాదకర వాతావరణం, జలపాతం అందాలను ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌ చేయడానికి అటవీ శాఖ మార్గాన్ని ఖరారు చేసింది. మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాక నుంచి మర్దగూడ ఎకో పార్కు వరకు సుమారు 24 కిలోమీటర్లు ట్రెక్కింగ్‌ చేయడానికి రూట్‌ను ఫైనల్‌ చేసింది. ట్రెక్కర్స్‌ మార్గమధ్యంలో సేదతీరేందుకు హోమ్‌ స్టే ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ట్రెక్కింగ్‌ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఎకో టూరిజంలో భాగంగా దీనిపై అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. అనంతగిరి, అరకులోయ మండలాల సరిహద్దు కొండలు ట్రెక్కింగ్‌కు అనువుగా ఉంటాయని అధికారులు గుర్తించారు. ట్రెక్కింగ్‌ మార్గాన్ని గుర్తించేందుకు మూడుసార్లు అటవీ శాఖాధికారులు, సిబ్బంది ట్రయల్‌ నిర్వహించారు. రాజుపాక నుంచి గాలికొండ, రక్తకొండ మీదుగా మర్దగూడ ఎకో పార్కు వరకు సుమారు 24 కిలోమీటర్ల మార్గం ట్రెక్కింగ్‌కు సౌలభ్యంగా ఉంటుందని మూడు రోజుల క్రితం వన్యప్రాణి కన్సల్టెంట్‌, భారతీయ మౌంటెనీర్‌ అరుణ్‌కుమార్‌ ఫైనల్‌ చేశారు. వారు రాజుపాక నుంచి బయలుదేరి డెక్కాపురం జలపాతం అందాలను వీక్షించి, అనంతరం సముద్రమట్టానికి 1,640 అడుగుల ఎత్తులో గల సంగంవలస, దొనిమోరి మధ్యలో గల కొండపైకి చేరుకున్నారు. కాగా దాబుగూడ, గంగుడి కొండల పైనుంచి బరజోల వెళ్లి హోమ్‌ స్టే చేయడానికి గల అవకాశాలను అటవీ అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడ నుంచి గాలికొండ, భీసుపురం, రక్తకొండ మీదుగా మర్దగూడ ఎకో టూరిజం పార్కుకు అటవీ ప్రాంతం గుండా చేరుకునే మార్గాన్ని గుర్తించారు. వన్యప్రాణులు అధికంగా ఉండే ప్రాంతాలను తప్పించి, జలపాతాలు, సుందరమైన ప్రకృతి అందాలు, విశ్రాంతి కేంద్రాలను కలుపుతూ ఈ ట్రెక్కింగ్‌ మార్గాన్ని రూపొందించారు. రూట్‌ ఫైనల్‌ కావడంతో ట్రెక్కర్స్‌కు సౌకర్యాల కల్పనపై ఆలోచిస్తున్నారు. హోమ్‌ స్టే సౌకర్యం కల్పించిన వెంటనే పూర్తిస్థాయిలో ట్రెక్కింగ్‌ మార్గాన్ని అందుబాటులోకి తెస్తారు.

ట్రెక్కింగ్‌ టూరిజంపై దృష్టి

కాగా పర్యాటకులు వారి వ్యక్తిగత ఆసక్తి మేరకు మాత్రమే ఇన్నాళ్లూ ఏజెన్సీలో ట్రెక్కింగ్‌ చేస్తున్నారు. అరకులోయ మండలం గాలికొండకు వివిధ ప్రాంతాల నుంచి ట్రెక్కర్స్‌ వస్తుంటారు. అయితే రానున్న రోజుల్లో అనంతగిరి, అరకులోయ మండలాల్లో ట్రెక్కింగ్‌ను మరింతగా ప్రోత్సహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సాహసికులకు అడవిపై అవగాహన కల్పించేలా..

ట్రెక్కింగ్‌ చేసేందుకు వచ్చే పర్యాటకులకు అడవిపై అవగాహన కల్పించాలని అటవీ శాఖాధికారులు భావిస్తున్నారు. మామిడి, సంపంగి, నేరెడు, నల్లమద్ది, తెల్లగత, నల్లగత, ఉసిరి, వేగిస, తదితర చెట్లపై అవగాహన కల్పిస్తూ, వన్యప్రాణుల సంరక్షణ, అడవుల సంరక్షణ గురించి వివరించడంతో పాటు అటవీ ఉత్పత్తులను స్వయంగా చూపించనున్నారు.

Updated Date - Aug 14 , 2026 | 01:03 AM