గ్రేటర్ ఎన్నికలకు లైన్‌క్లియర్
ABN , Publish Date - Oct 02 , 2026 | 12:54 AM
జీవీఎంసీ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం తొలగింది.
తొలగిన అడ్డంకులు
స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు
రెండో వారంలో నోటిఫికేషన్ వస్తుందని జీవీఎంసీ అధికారుల అంచనా
నెలాఖరులోగా పోలింగ్ పూర్తి
ఆశావహుల్లో ఉత్సాహం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికలపై నెలకొన్న సందిగ్ధం తొలగింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్లను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తాజా ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులను వేగవంతం చేస్తున్నారు.
రాష్ట్రంలోని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు అక్టోబరు నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 16వ ఆర్థిక సంఘం నిధులు పొందాలంటే ఎన్నికలను పూర్తిచేయడం తప్పనిసరి కావడంతో అందుకు శరవేగంగా ఏర్పాట్లుచేస్తోంది. జీవీఎంసీకి మొదటి విడతలో ఎన్నికలు జరిపే అవకాశం ఉండడంతో అధికారులు ఒక్కో ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. 98 వార్డులను 120 వార్డులుగా విభజించారు. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా విచారణ జరిపి ఆ పిటిషన్లను కొట్టేసింది. తర్వాత అధికారులు వార్డుల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను విడుదల చేశారు. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత వివరాలను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం వార్డులు, మేయర్ పదవికి రిజర్వేషన్లు ఖరారు చేస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో మళ్లీ కొందరు రిజర్వేషన్ల ఖరారుకు కీలకమైన ఎస్సీ, ఎస్టీ,బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ సక్రమంగా జరగలేదని, అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. మరికొందరు ‘సర్’ ప్రక్రియ జరుగుతున్నందున అది ముగిసేంత వరకు ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ గురువారం తగిన ఆదేశాలు జారీచేసింది. దీంతో జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి ఉన్న అవరోధాలన్నీ తొలగిపోయినట్టయింది. వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు అవసరమైన ఓటర్ల గుర్తింపు ప్రక్రియపై అభ్యంతరాలు తెలిపేందుకు మరో రెండు రోజులు గడువు ఇచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల షెడ్యూల్ జారీ ముందనుకున్నదానికంటే రెండు రోజులు ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ఈనెల పదో తేదీన నోటిఫికేషన్ జారీచేసే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు అందుకోసం అవసరమైన ప్రక్రియలను పూర్తిచేయడంపై దృష్టిపెట్టారు. అనుకోని అడ్డంకులు ఎదురైతే తప్ప ఈనెల పదిన నోటిఫికేషన్ విడుదల అవడం ఖాయమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
నాలుగు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
అధికారుల సన్నాహాలు
విశాఖపట్నం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):
హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. ఆరు వారాల్లోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు జడ్పీ, పంచాయతీ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా పరిషత్‌ల విభజన తరువాత విశాఖ జిల్లాలో కేవలం నాలుగు మండలాలు (ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం) మిగిలాయి. వచ్చే ఏడాది మార్చిలో జనాభా లెక్కల ప్రక్రియ ముగిసేంత వరకూ స్థానిక సంస్థల సరిహద్దులను మార్చరాదని కేంద్రం ఆదేశించింది. దీంతో జీవీఎంసీలో నాలుగు గ్రామీణ మండలాల విలీనం సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో నాలుగు మండలాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు సిద్ధం చేశారు. అదేవిధంగా జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాలు, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల జాబితాలు సిద్ధం చేశారు. మునిసిపాలిటీలు, జడ్పీ ఎన్నికల తరువాత చివరిగా పంచాయతీలు ఎన్నికలు జరుగుతాయనే అంచనా వేస్తున్నారు.