Share News

మేయర్‌ సీటు యమ హాట్‌

ABN , Publish Date - Sep 04 , 2026 | 01:04 AM

స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబరు నెలాఖరులోగా నిర్వహించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

మేయర్‌ సీటు యమ హాట్‌

టీడీపీలో భారీ పోటీ

శాసనసభ్యుల కుటుంబాల నుంచి ఆశావహులు

రేస్‌లో ఎమ్మెల్యేలు గంటా, గణబాబు కుమారులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి, గండి బాబ్జీ, మాజీ మేయర్‌ సోదరుడు పీలా గోవింద, పల్లా బంధువు మురళి, అక్కరమాని విజయనిర్మల, మాజీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు...

ఇప్పటికే సీఎం, మంత్రి నారా లోకేశ్‌ను కలిసి బయోడేటాలు సమర్పణ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబరు నెలాఖరులోగా నిర్వహించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి ముందు కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది. కోర్టుల్లో కేసులు ఉన్నా సరే ఎన్నికలకు వెళుతున్నామని సూత్రప్రాయంగా ప్రభుత్వ పెద్దలు వెల్లడించినట్టు చెబుతున్నారు. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నందున గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మేయర్‌ పదవికి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీలో పలువురు పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో బీసీ జనరల్‌ కావడంతో ఈసారి ఓపెన్‌ కేటగిరీ (జనరల్‌)గా మారుతుందా? లేదా బీసీ జనరల్‌గా కొనసాగుతుందా?...అనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మేయర్‌ సీటు కోసం పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కుమారుడు గణబాబు కుమారుడు మౌర్యసింహ, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ, మాజీ మేయర్‌ పీలా శ్రీనివాసరావు సోదరుడు, అనకాపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి పీలా గోవింద, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమీప బంధువు పక్కుర్తి మురళి, పార్టీ సీనియర్‌ నేతలు కోరాడ రాజబాబు, ఒమ్మి సన్యాసిరావు, వీఎంఆర్డీఏ మాజీ చైర్‌పర్సన్‌ అక్కరమాని నిర్మల, మాజీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. జనరల్‌ (ఓపెన్‌ కేటగిరీ)కు కేటాయిస్తే పట్టాభి, గంటా కుమారుడు రవితేజ ఆశిస్తున్నారు. ఓసీ జనరల్‌ అయినా బీసీ నేతలంతా సీటు అడుగుతున్నారు. మంత్రి నారా లోకేశ్‌కు ఇప్పటికే పలువురు తమ బయోడేటాలు అందజేశారు. ఎమ్మెల్యేలు కూడా తమ వారసుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా గండి బాబ్జీ ఇటీవల లోకేశ్‌ను కలిసి తన పేరు పరిశీలించాలని, యువతకు అవకాశం ఇవ్వాలనుకుంటే తన కుమారుడు వంశీ అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ఇదిలావుండగా 2021లో టీడీపీ మేయర్‌ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును అధిష్ఠానం ప్రకటించింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీకి పూర్తి మెజారిటీ రాలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బలాబలాలు మారడంతో పీలా శ్రీనివాసపరావుకు అవకాశం లభించింది. మేయర్‌గా పీలా శ్రీనివాసరావు సుమారు ఏడాదిపాటు పనిచేశారు. పూర్తికాలం మేయర్‌గా పనిచేయనందున మరోమారు తమ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని అధినేతను పీలా గోవింద కోరినట్టు తెలిసింది. తన కుమారుడు మౌర్యసింహకు మేయర్‌గా అవకాశం ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేల ద్వారా పశ్చిమ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ను ఇప్పటికే కోరారు. ఇలా...ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే అధినేత చంద్రబాబునాయుడు మనసులో ఏమున్నదీ ఎవరికి తెలియదు. గతంలో ఒకసారి తటస్థుల నుంచి మేయర్‌ అభ్యర్థిని ఎంపిక చేసిన విషయాన్ని పలువురు గుర్తుచేస్తున్నారు. ఈ పర్యాయం అటువంటి ప్రయోగం ఏమైనా చేస్తారా? లేదా లోకేశ్‌ ఆలోచనలకు అనుగుణంగా యువకుల నుంచి ఒకరికి అవకాశం ఇస్తారా?...అనేది చూడాలి. తటస్థులను కాకుండా పార్టీని నమ్ముకొని దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని మేయర్‌ పదవికి పరిగణనలోకి తీసుకోవాలని నేతలు కోరుతున్నారు.

Updated Date - Sep 04 , 2026 | 01:04 AM