గ్రేటర్ ఎన్నికలకు లైన్ క్లియర్
ABN , Publish Date - Sep 04 , 2026 | 01:01 AM
జీవీఎంసీ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది.
తొలగిన న్యాయపరమైన అడ్డంకులు
వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
వార్డుల పునర్విభజనకు సంబంధించి నేడో, రేపో తుది ముసాయిదా విడుదల
మరోమారు అభ్యంతరాల స్వీకరణ
అనంతరం గెజిట్ జారీ చేయనున్న ప్రభుత్వం
ఎన్నిక నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఈ నేపథ్యంలో పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. నేడో రేపు తుది ముసాయిదాను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
జీవీఎంసీ పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది మార్చితో ముగిసింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక అధికారి పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను నిర్ణయిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 98 వార్డులను 120కి పెంచుతూ పునర్విభజన చేపట్టాలంటూ ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీచేసింది. జీవీఎంసీ అధికారులు 120 వార్డులుగా విభజిస్తూ పునర్విభజన చేపట్టారు. ప్రాథమిక ముసాయిదాను తయారుచేసి నోటిఫికేషన్ జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. మొత్తం 2,667 అభ్యంతరాలు, అభిప్రాయాలు అధికారులకు అందగా వాటిలో పరిగణనలోకి తీసుకోదగిన వాటి ఆధారంగా వార్డుల సరిహద్దులను సవరించి తుది ముసాయిదాను ప్రభుత్వానికి పంపించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో జనగణన జరుగుతున్న సమయంలో పునర్విభజన చేయడం సరికాదని, దీనిని నిలువరిస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని పరిశీలనకు తీసుకున్న హైకోర్టు వార్డుల పునర్విభజన ప్రక్రియపై స్టే విధించింది. ఇటీవల కాలంలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై దాఖలైన పిటిషన్‌పై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు జనాభా లెక్కలకు, వార్డుల పునర్విభజనకు సంబంధం లేదని, జీవీఎంసీ సరిహద్దును మార్చకుండా కేవలం అంతర్గతంగా వార్డుల పునర్విభజన మాత్రమే చేస్తున్నందున పిటిషన్‌పై విచారణ జరపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతూ గురువారం కొట్టివేసింది. రాష్ట్రవ్యాప్తంగా వార్డుల పునర్విభజనను నిలిపివేయాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లపైన హైకోర్టు ఇదే నిర్ణయం తీసుకుంది. దీంతో జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయినట్టయింది.
హైకోర్టు తీర్పుతో జీవీఎంసీ అధికారులు వార్డుల పునర్విభజన ప్రక్రియను తిరిగి ప్రారంభించారు. ఇప్పటికే ప్రాథమిక ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ముసాయిదాను తయారుచేసి ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుది ముసాయిదాను విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. పునర్విభజన ప్రక్రియపై ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ జారీచేసి తిరిగి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. మరోమారు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం వార్డుల సరిహద్దులను నిర్ధారిస్తూ గెజిట్ జారీచేస్తుంది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరనుంది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీచేసి, నోటిఫికేషన్ జారీచేసి ఎన్నిక నిర్వహించనుంది. ఈ మొత్తం ప్రక్రియను అక్టోబరు చివరినాటికి పూర్తిచేస్తేనే కేంద్ర ప్రభుత్వం నుంచి 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. కాబట్టి ఆలోగా ఎన్నికలు పూర్తిచేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
‘విలీనం’ ప్రతిపాదనతో సందిగ్ధం
జిల్లా పరిధిలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లోని 79 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని నగరానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కోరడంతో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు గ్రామసభలు నిర్వహించగా మిశ్రమ స్పందన లభించింది. పదేళ్ల వరకూ పన్నులు పెంచబోమని, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని అనేక గ్రామాలు డిమాండ్ చేశాయి. అలాగైతే విలీనానికి తమకు అభ్యంతరం లేదని ప్రకటించాయి. ఒకవేళ ఆయా గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకుంటే జీవీఎంసీకి ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. విలీనానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది ఉండదు