Share News

మూలపేట పోర్టులో భాగస్వామ్యం

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:28 AM

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూలపేట పోర్టులో 49 నుంచి 50 శాతం వాటా తీసుకోవడానికి విశాఖపట్నం పోర్టు ఆసక్తి చూపిస్తోంది.

మూలపేట పోర్టులో భాగస్వామ్యం

విశాఖ పోర్టు ఆసక్తి

49 నుంచి 50 శాతం తీసుకోవడానికి నిర్ణయం

బల్క్‌ కార్గో అక్కడికి తరలించాలని ప్రణాళిక

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

శ్రీకాకుళం జిల్లా మూలపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న మూలపేట పోర్టులో 49 నుంచి 50 శాతం వాటా తీసుకోవడానికి విశాఖపట్నం పోర్టు ఆసక్తి చూపిస్తోంది. ఆ జిల్లాలో కొత్త పోర్టు ప్రతిపాదన వచ్చినప్పుడే సుమారు రూ.1,500 కోట్లు పెట్టుబడి పెడతామని విశాఖ పోర్టు యాజమాన్యం ప్రకటించింది.

విశాఖపట్నం పోర్టులో సరుకు రవాణా పెరిగింది. భవిష్యత్తులో ఇంకా పెరగనున్నది. విస్తరణకు అవసరమైనంత భూమి లేదు. ఈ నేపథ్యంలో భీమిలి సమీపాన మూలకుద్దులో ఒక శాటిలైట్‌ పోర్టు నిర్మించాలనే ప్రతిపాదన చేశారు. అది కార్యరూపం దాల్చలేదు. ఇటీవల మూలపేట పోర్టు ప్రతిపాదన రాగానే అది కూడా విశాఖకు సమీపంలోనే ఉండడంతో అందులో భాగస్వామి కావడానికి ముందుకు వచ్చింది. విశాఖ పోర్టులో హ్యాండిల్‌ చేస్తున్న బల్క్‌ కార్గో బొగ్గు, ఐరన్‌ఓర్‌, మాంగనీస్‌ తదితరాలను మూలపేటకు తరలించాలనేది యాజమాన్యం ఆలోచన. దీనివల్ల విశాఖలో కొంత మేరకు కాలుష్యం తగ్గుతుందనే అభిప్రాయం ఉంది. అక్కడ మూలపేట పోర్టు జనావాసాలకు దూరంగా ఉండడం వల్ల బల్క్‌ కార్గో వల్ల అక్కడ ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ నేపథ్యంలో ఆ పోర్టులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. దీని కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటుచేస్తామని పేర్కొంది.

మూలపేటలో రూ.3,670 కోట్లతో పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదికి 23.5 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయాలనేది లక్ష్యం. తొలి దశలో నాలుగు బెర్తులు నిర్మించి, అందులో మూడు జనరల్‌ కార్గోకు, మరొకటి బొగ్గు కోసం కేటాయించనున్నారు. మూలపేటలో తొలి దశలో రెండు బెర్తులు, మలి దశలో మరో రెండు బెర్తులు తమకు కేటాయించాలని విశాఖపట్నం పోర్టు కోరుతోంది. తాము భాగస్వాములుగా ఉంటే వాణిజ్యపరంగా బాగుంటుందని, రవాణాకు తగినంత సరుకు అందుబాటులో ఉంటుందని చెబుతోంది. మూలపేట పోర్టులో ఉప్పు భూములను కేటాయించి, వాటి విలువ లెక్కిస్తే దానికి తగినట్టుగా ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ ప్రతిపాదనపై చర్చించాలని మంత్రుల బృందానికి ప్రభుత్వం సిఫారసు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ దీనిపై చర్చించనున్నారు.


దేవాదాయ శాఖలో సూపరింటెండెంట్‌ పోస్టులు మాయం

డీఈఓలుగా పదోన్నతి

కొత్త జిల్లాలకు సర్దుబాటు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖలో సూపరింటెండెంట్‌ పోస్టులు ఎత్తేశారు. ప్రతి జిల్లా కార్యాలయంలో అవసరాన్ని బట్టి ఒకరు, విశాఖ వంటి జిల్లాలో ఇద్దరు చొప్పున సూపరింటెండెంట్లు ఉండేవారు. కొత్త జిల్లాలు ఏర్పాటుచేసిన తరువాత కొత్త పోస్టులు ఇవ్వలేదు. దాంతో ఉన్నవారినే కమిషనరేట్‌ కార్యాలయం సర్దుబాటు చేసింది. జిల్లా దేవదాయ శాఖాధికారి కార్యాలయంలో ఉండే సూపరింటెండెంట్లకు జిల్లా దేవదాయ శాఖాధికారి (డీఈఓ)గా పదోన్నతి కల్పించి కొత్త జిల్లాలకు పంపించారు. ఆ విధంగా విశాఖ జిల్లా కార్యాలయంలో ఇద్దరు ఉండగా ఒకరిని అనకాపల్లి డీఈఓగా పంపించారు. విజయనగరంలో సూపరింటెండెంట్‌ను పార్వతీపురం మన్యం డీఈఓగా వేశారు. తాజాగా జోన్ల విభజన కూడా చేశాక విశాఖ జిల్లాలో మిగిలిన సూపరింటెండెంట్‌ పోస్టును కాకినాడ జోనల్‌ కార్యాలయానికి కేటాయించేశారు. దాంతో ఇక్కడ పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ అక్కడకు వెళ్లిపోయారు. అనకాపల్లి డీఈఓగా వెళ్లిన సుధారాణి కాకినాడ ఆప్షన్‌ తీసుకోవడంతో ఆమెను ఆ జోన్‌కు బదిలీ చేశారు. దాంతో అనకాపల్లిలో ఖాళీ అయిన డీఈఓ పోస్టులో శ్రీకాకుళంలో సూపరింటెంటెండ్‌గా పనిచేస్తున్న రమణిని నియమించారు. ఈ సర్దుబాట్లలో మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల్లో సూపరింటెండెంట్‌ పోస్టులు మొత్తం మాయమైపోయాయి. కొత్త పోస్టులు మంజూరుకాకపోవడం వల్ల ఇప్పుడు సూపరింటెండెంట్లు చేస్తున్న పనులన్నీ డీఈఓలే చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.

Updated Date - Oct 25 , 2026 | 01:28 AM