అభ్యర్థుల ఎంపికలో పార్టీలు బిజీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:39 AM
మునిసిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అధికారులు ఏర్పాట్లలో బీజీ అయిపోయారు. మరోవైపు చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు అవకాశం కల్పించాలంటూ పలువురు ఆశావహులు ఆయా పార్టీల పెద్దలకు తమ బయోడేటాలతోపాటు వినతిపత్రాలు అందిస్తున్నారు.
నేతలకు బయోడేటాతోపాటు వినతిపత్రాలు అందజేస్తున్న ఆశావహులు
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
నర్సీపట్నంలో 40 వార్డులు
49,099 మంది ఓటర్లు
నర్సీపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో అధికారులు ఏర్పాట్లలో బీజీ అయిపోయారు. మరోవైపు చైర్పర్సన్, కౌన్సిలర్ పదవులకు అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు అవకాశం కల్పించాలంటూ పలువురు ఆశావహులు ఆయా పార్టీల పెద్దలకు తమ బయోడేటాలతోపాటు వినతిపత్రాలు అందిస్తున్నారు.
నర్సీపట్నం మునిసిపాలిటీలో 40 వార్డులు వున్నాయి. మొత్తం 49,099 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 23,317 మంది, మహిళలు 25,778 మంది, ఇతరులు నలుగురు ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండడంతో చైర్పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. ఇక సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా బీసీ ఓటర్లు 36,326 (74 శాతం) వున్నారు. ఎస్సీలు 4,960 మంది, ఎస్టీలు 743 మంది, ఓసీలు 7,070 మంది ఉన్నారు.
సుమారు దశాబ్దంన్నర క్రితం నర్సీపట్నం మునిసిపాలిటీ ఏర్పడింది. అప్పట్లో గ్రేడ్-3లో వున్న ఈ మునిసిపాలిటీకి 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో చైర్పర్సన్ పదవిని బీసీ మహిళలకు కేటాయించారు. తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేశారు. గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో చైర్‌పర్సన్‌ను పరోక్ష పద్ధతిలో (కౌన్సిలర్లు) ఎన్నుకోగా, ఈసారి ఎనిఇ్నకల్లో ప్రత్యక్షంగా (ఓటర్లంతా) ఎన్నుకుంటారు. ప్రతి ఒక్కరు రెండు ఓట్లు (ఒకటి కౌన్సిలర్‌కు, ఒకటి చైర్‌పర్సన్‌కు) వేయాల్సి ఉంటుంది. వైస్ చైర్మన్‌ను కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. గత పర్యాయం ఎన్నికలను ఈవీఎంలతో నిర్వహించగా ఈ దఫా బ్యాలట్ విధానంలో నిర్వహిస్తున్నారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీతోపాటు, ప్రతిపక్ష వైసీపీ నుంచి పోటీ చేసే చైర్పర్సన్, కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాలను గురువారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
మునిసిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం మొదలవుతుంది. 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీన పరిశీలన, 20, 21 తేదీల్లో ఉపసంహరణ వుంటాయి. 21వ తేదీ సాయంత్రం పోటీలో వున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి, 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. బుధవారం నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మునిసిపాలిటీ పరిధిలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించాలని, నేతల విగ్రహాలకు ముసుగులు వేయాలని కమిషనర్ సురేంద్ర, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మునిసిపాలిటీ వున్న 76 పోలింగ్ కేంద్రాలను తొమ్మిది రూట్లుగా విభజించి తొమ్మిది మంది రూట్ ఆఫీసర్లు, ఐదుగురు జోనల్ అధికారులను నియమించారు.