Share News

ఇష్టారాజ్యంగా పార్కింగ్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:09 AM

జాతీయ రహదారి పక్కన ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. హోటళ్లు, దాబాలు వున్నచోట పదుల సంఖ్యలో లారీలో బారులు తీరి వుంటున్నాయి. దీనివల్ల రహదారి ఇరుకుగా మారి, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిరంతరం గస్తీ తిరుగుతున్న హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్న భారీ వాహనాలపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇష్టారాజ్యంగా పార్కింగ్‌
పులపర్తి- ధర్మవరం మధ్య జాతీయ రహదారి పక్కన నిలుపుదల చేసిన సరుకు రవాణా వాహనాలు

జాతీయ రహదారిపై ఎక్కడపడితే అక్కడ భారీ వాహనాల నిలుపుదల

రాత్రిపూట తరచూ ప్రమాదాలు

పట్టించుకోని హైవే పెట్రోలింగ్‌ పోలీసులు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి పక్కన ఎక్కడపడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను నిలుపుదల చేస్తున్నారు. హోటళ్లు, దాబాలు వున్నచోట పదుల సంఖ్యలో లారీలో బారులు తీరి వుంటున్నాయి. దీనివల్ల రహదారి ఇరుకుగా మారి, ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నిరంతరం గస్తీ తిరుగుతున్న హైవే పెట్రోలింగ్‌ పోలీసులు, నిబంధనలను ఉల్లంఘిస్తున్న భారీ వాహనాలపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జాతీయ రహదారి పక్కన ఇలా వాహనాలను నిలుపుదల చేయడం వల్ల పగటిపూట కన్నా రాత్రిపూట ఎక్కువ ప్రమాదకరంగా మారింది. హైవేపై ప్రయాణించే సరుకు రవాణా వాహనాలను నిలుపుదల చేసి, డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి జాతీయ రహదారిపై నిర్ణీత ప్రదేశాల్లో ‘పార్కింగ్‌ బే’లు వున్నాయి. ఈ ప్రదేశాల్లో మినహా రహదారి పక్కన మరెక్కడా భారీ వాహనాలను నిలుపుదల చేయకూడదు. కానీ పలువురు డ్రైవర్లు ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ ఇష్టం వచ్చినచోట లారీలను పార్కింగ్‌ చేస్తున్నారు.

ఎలమంచిలి మండలంలో ఇటు షేకిళ్లపాలెం నుంచి అటు ధర్మవరం వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి వుంది. ఈ మధ్యలో కొక్కిరాపల్లి, రేగుపాలెం, మర్రిబంద, పులపర్తి, పోతిరెడ్డిపాలెం, లక్కవరం జంక్షన్‌ల వద్ద సరుకు రవాణా వాహనాలను ఎక్కువగా నిలుపుదల చేస్తున్నారు. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా భారీ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుదల చేయకుండా చూడాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 01:09 AM