Share News

పార్కు శుభ్రం

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:18 AM

సాగర్‌నగర్‌లోని ఎంఐజీ-డి పార్కును శుభ్రం చేసే పనులను జీవీఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు శనివారం మొదలెట్టారు.

పార్కు శుభ్రం

ఎమ్మెల్యే గంటా ఆదేశాలతో కదిలిన జీవీఎంసీ సిబ్బంది

పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని స్థానికుల విజ్ఞప్తి

సాగర్‌నగర్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

సాగర్‌నగర్‌లోని ఎంఐజీ-డి పార్కును శుభ్రం చేసే పనులను జీవీఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు శనివారం మొదలెట్టారు. వ్యర్థాలు, పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. ఇటీవల సాగర్‌నగర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా....’ కార్యక్రమంలో స్థానికులు ఈ పార్కు సమస్యను శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకు తొలుత పార్కును శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. రెండు రోజులుగా యంత్రాల సహాయంతో పనులు చేస్తున్నారు. ఏళ్లుగా పోగుపడిన ఎండుటాకులు, ప్లాస్టిక్‌ వ్యర్థాలు, నిర్మాణ సామగ్రిని తొలగించడానికి పారిశుధ్య సిబ్బందితో పాటు అత్యాధునిక యంత్రాలను వినియోగిస్తున్నారు.

స్థానికుల హర్షం

ఈ పార్కు వ్యర్థాల కుప్పగా మారడంతో దోమలు, కీటకాలు పెరిగి చుట్టుపక్కల నివాసం ఉండేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ చొరవతో ఎట్టకేలకు పార్కు బాగుపడడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్కును పునరుద్ధరించి మళ్లీ ఆహ్లాదకర వాతావరణం తీసుకురావాలని కోరుతున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 01:18 AM