తేలని పరిషత్ పంచాయితీ!
ABN , Publish Date - Oct 25 , 2026 | 11:59 PM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీట్ల పంపకాలపై పడింది.
కూటమిలో కొలిక్కిరాని సీట్ల పంపకాలు
వైసీపీలో వర్గాల పోరు
సర్దుబాటుతో సంబంధం లేకుండా పోటాపోటీగా నామినేషన్లు
ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ 400, టీడీపీ 346, స్వతంత్రులు 101, జనసేన 91, బీజేపీ 65...
జడ్పీటీసీ స్థానాలకు వైసీపీ 35, టీడీపీ 34, స్వతంత్రులు 22, జనసేన 16, బీజేపీ 13, కాంగ్రెస్ 12 నామినేషన్లు
గుట్టుగా బీ ఫారాల కోసం నేతల పైరవీలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి సీట్ల పంపకాలపై పడింది. అయితే ఇప్పటికీ కూటమిలోని మూడు పార్టీల నేతలు, వైసీపీలోని వర్గాలుగా ఉన్న నేతల సీట్ల పంపకాలకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కిరాలేదు.
మన్యంలో కూటమిలో సీట్ల లెక్కలు తేలకపోవడంతో పాటు మూడు పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరికి వాళ్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. కొందరైతే ఏకంగా ఎన్నికల ప్రచారాలే చేసేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికీ సీట్ల సర్దుబాటుతో పాటు అభ్యర్థుల ఖరారు జరగలేదు. కానీ ఎవరివాళ్లు తమకే సీటు దక్కుతుందనే ఆశతో నామినేషన్లను దాఖలు చేసేశారు. అలాగే స్థానికంగా ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించకుండా పలు చోట్ల నామినేన్లు దాఖలు కావడంతో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వాటిపై చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు ఎంపీపీ పదవులపైనా చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికీ సీట్ల సర్దుబాటు ఖరారు కాకపోవడం వల్ల అధిక సంఖ్యలో రెబల్స్‌గా బరిలోకి దిగే అవకాశముంది. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సీట్ల పంపకం జరగాలని, లేకుంటే ప్రత్యర్థి పార్టీకి మేలు జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే వైసీపీలోనూ వర్గాలు ఉండడంతో సీట్ల పంపకం, సర్దుబాటు సైతం కాస్త ఇబ్బందికరంగానే ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సైతం ఆ పార్టీకి ఇద్దరు, ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఉదాహరణకు అరకులోయ జడ్పీటీసీ స్థానానికి వైసీపీ నుంచి పాంగి చిన్నారావు, దురియా ఆనంద్‌కుమార్, కంబిడి అశోక్, శెట్టి రోషిణి నామినేషన్ దాఖలు చేశారు. ఇదే పరిస్థితి అనేక మండలాల్లో ఉంది. అయితే కూటమి పార్టీలు, వైసీపీలోనూ సీట్ల పంచాయతీ ఆలస్యమైన కొద్దీ రెబల్స్ బెడద అధికమయ్యే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే బీఫారాలు సమర్పించేందుకు 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉండడంతో మంగళవారం నాటికి మొత్తం వ్యవహారం కొలిక్కి రాక తప్పదు. కాగా కొందరు తమ నేతలను పట్టుకుని బీ ఫారాల కోసం గుట్టుగా పైరవీలు సాగిస్తున్నట్టు తెలిసింది.
పోటాపోటీగా నామినేషన్లు దాఖలు
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సీట్ల పంపకం జరగనప్పటికీ అన్ని పార్టీల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. జిల్లాలోని 11 మండలాల్లోని 172 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 1,100 నామినేషన్లు పడగా, వాటిలో వైసీపీ నుంచి 400, టీడీపీ నేతలు 346, స్వతంత్రులు 101, జనసేన 91, బీజేపీ 65, సీపీఎం 56, కాంగ్రెస్ 38, బీఎస్పీ 2, ఆప్ 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం నామినేషన్లలో వైసీపీవే 400 కావడం విశేషం. అలాగే మొత్తం 11 జడ్పీటీసీ స్థానాలకు 144 నామినేషన్ల పడగా, వాటిలో వైసీపీ 35, టీడీపీ 34, స్వతంత్రులు 22, జనసేన 16, బీజేపీ 13, కాంగ్రెస్ 12, సీపీఎం 7, ఆప్ 4, బీఎస్సీ 1 నామినేషన్ దాఖలు చేశారు.