ముగిసిన పరిషత్ ఎన్నికల ప్రచారం
ABN , Publish Date - Nov 04 , 2026 | 02:33 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది.
జడ్పీటీసీ, ఎంపీటీసీలకు రేపు పోలింగ్
ఏడున ఓట్ల లెక్కింపు
విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది. చివరిరోజు కావడంతో కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అభ్యర్థులు కలిసి భారీఎత్తున ప్రచారం చేశారు. కాగా ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. మంగళవారం సాయంత్రానికి అన్ని పోలింగ్ బూత్‌లను సంబంధిత అధికారులు, పోలీసులు సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో నాలుగు జడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి) మండలాల పరిధిలో మొత్తం 1,60,407 మంది (పురుషులు 79,630 మంది, మహిళలు 82,377 మంది) ఓటర్లు ఉన్నారు. ఆనందపురం మండలంలో 65, పద్మనాభంలో 56, భీమిలిలో 43, పెందుర్తిలో 39...మొత్తం 203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడో తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.