Share News

విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం

ABN , Publish Date - Jul 24 , 2026 | 11:15 PM

విద్యాభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరం
కార్యక్రమంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

మెగా పీటీఎంలో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

జిల్లా కేంద్రంలో ఘనంగా మెగా పీటీఎం 4.0 వేడుకలు

పాడేరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): విద్యాభివృద్ధికి విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి అన్నారు. స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పాఠశాల అభివృద్ధి, విద్యాప్రగతి కేవలం ఉపాధ్యాయుల బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు సైతం భాగస్వామ్యం ముఖ్యమన్నారు. తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్లడం, ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల అభ్యాసన, అక్కడ వసతులు, తదితర అంశాలపై సైతం అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. విద్యార్థులను ప్రతి రోజూ పాఠశాలకు పంపడం, ఉపాధ్యాయులు, పాఠశాల నిర్వహణ కమిటీకి సహకరించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంలో విద్యాభివృద్ధికి కృషి చేసి విద్యార్థుల భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలోని పలువురు తల్లిదండ్రులతో కలెక్టర్‌ మాట్లాడి, తమ పిల్లల చదువులు, కల్పిస్తున్న సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో రూపొందించిన వివిధ రకాల యూనిట్‌లను ఆమె పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌ వంపూరు గంగులయ్య, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడ కృష్ణారావు, తదితరులు పీటీఎంను మాట్లాడారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఈవో, టీడబ్ల్యూ డీడీ పరిమిళ, సమగ్ర శిక్ష ఏపీసీ వీఏ.స్వామినాయుడు, పాఠశాల హెచ్‌ఎం టి.నాగేశ్వరరావు, మాజీఎంపీపీ బొర్రా విజయరాణి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పి.నాగేశ్వరరావు, ఎంఈవోలు బి.విశ్వసాధం, సీహెచ్‌.సరస్వతి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Jul 24 , 2026 | 11:15 PM