Share News

పంచాయతీలకు సొంతగూడు

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:04 AM

జిల్లాలో గ్రామ పరిపాలనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. చాలాచోట్ల గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం, ఉన్న భవనాలు సైతం శిథిలావస్థకు చేరడంతో ఆయా పంచాయతీల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు.

పంచాయతీలకు సొంతగూడు
అనకాపల్లి మండలం భట్లపూడిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం

26 గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణం

ఒక్కో భవనానికి రూ.35 లక్షలు కేటాయింపు

చురుగ్గా సాగుతున్న పనులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గ్రామ పరిపాలనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. చాలాచోట్ల గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు లేకపోవడం, ఉన్న భవనాలు సైతం శిథిలావస్థకు చేరడంతో ఆయా పంచాయతీల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ పాలకవర్గ సమావేశాలను, రికార్డులను సరిగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించి దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నది. సొంత భవనాలు లేని పంచాయతీలకు కొత్త భవనాల నిర్మాణాల కోసం అవసరమైన స్థలాలను గుర్తించే బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. స్థలాలు అందుబాటులో లేని పంచాయతీల్లో స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నచోట నిధులు మంజూరు చేసి, వెంటనే నిర్మాణాలు చేపడుతున్నారు.

జిల్లాలో 646 గ్రామ పంచాయతీలు వుండగా వీటిలో 95 పంచాయతీలకు సొంత భవనాలు లేవు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పంచాయతీకి కూడా సొంత భవనం నిర్మించలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 26 పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూరు చేసింది. ఉపాధిహామీ పథకం, గ్రామ పంచాయతీల సాధారణ నిధుల నుంచి రూ.35 లక్షల చొప్పున కేటాయిస్తున్నది. ఇప్పటికే ఐదు భవనాల నిర్మాణ పనులు పూర్తికావడంతో అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో వున్నాయి. ప్రతి భవనంలో ఈవోకు, సర్పంచ్‌కు వేర్వేరుగా గదులు, సమావేశ మందిరం, రికార్డు గది, ప్రజలు వేచివుండే హాల్‌, మరుగుదొడ్లు వుంటాయి.

Updated Date - Jan 29 , 2026 | 01:04 AM