Share News

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:33 AM

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు.

పకడ్బందీగా పంచాయతీ ఎన్నికలు
అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి

ఆర్వోలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిషాంతి ఆదేశం

సజావుగా నిర్వహణకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి

ఎటువంటి పొరపాట్లకు తావివ్వొద్దు

పాడేరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ టి.నిషాంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మండల స్థాయి రిటర్నింగ్‌ అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పంచాయతీల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, నామినేషన్ల స్వీకరణ మొదలు, పోలింగ్‌, కౌంటింగ్‌, ఫలితాలు వెల్లడించే వరకు ప్రతి ప్రక్రియను పక్కాగా చేపట్టాలన్నారు. ఈ క్రమంలో ఎటువంటి పొరపాట్లు, సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీలు, 2,446 వార్డులకు మూడు విడతలుగా జరిగే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు, సిబ్బందికి ఇచ్చిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌కలెక్టర్‌ కె.సాహిత్‌, జడ్పీ సీఈవో పి.వాసుదేవరావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్‌, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, డీఎల్‌పీవో పీఎస్‌.కుమార్‌, మండల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:33 AM