Share News

పంచగ్రామాల భూ సమస్యపై గళం

ABN , Publish Date - Mar 05 , 2026 | 01:19 AM

సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల భూ సమస్యపై జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బుధవారం గళమెత్తారు. ముప్పై ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపించడంలో ఇప్పటికే తీవ్రమైన జాప్యం జరిగిందని, ఇంకా ఆలస్యం చేస్తే చరిత్ర క్షమించదని ఆవేదన వ్యక్తంచేశారు.

పంచగ్రామాల  భూ సమస్యపై గళం

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యేలు

ఇంకా ఆలస్యం చేస్తే చరిత్ర క్షమించదు: గంటా

ప్రత్యామ్నాయ భూములు ఇస్తున్నా ఎందుకు ఆలస్యం: పంచకర్ల

కోర్టులో కేసు ఉందని జాప్యం చేస్తున్నారన్న గణబాబు

త్వరగా పరిష్కారం చూపాలి: వెలగపూడి

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం దేవస్థానానికి చెందిన పంచ గ్రామాల భూ సమస్యపై జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బుధవారం గళమెత్తారు. ముప్పై ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం చూపించడంలో ఇప్పటికే తీవ్రమైన జాప్యం జరిగిందని, ఇంకా ఆలస్యం చేస్తే చరిత్ర క్షమించదని ఆవేదన వ్యక్తంచేశారు. దేవస్థానం ధర్మకర్త అశోక్‌గజపతిరాజు భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపారని, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని, ఇరువర్గాలు సానుకూలంగా ఉన్నప్పుడు ఇంకా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదో దేవదాయ శాఖాధికారులు చెప్పాలని ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, అడవివరం, చీమలాపల్లి, వేపగుంట, వెంకటాపురం, పురుషోత్తపురం గ్రామాల సమస్య గత 30 ఏళ్లుగా అన్ని పార్టీలకు ఎన్నికల అజెండాలో అగ్రస్థానంలో ఉంటోందని, కానీ పరిష్కారం లభించడం లేదన్నారు. 1996లో హౌస్‌ కమిటీ వేశారని, 2000లో చంద్రబాబునాయుడు 578, 2019లో 229 జీఓలు ఇచ్చారని గుర్తుచేశారు. రాజశేఖర్‌రెడ్డి ఉచితంగా రెగ్యులర్‌ చేస్తానని చెప్పి 2004లో 578 జీవోను రద్దు చేశారని ఆరోపించారు. 2014లో ఏయూలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో పంచ గ్రామాల సమస్యే చర్చించామని గుర్తుచేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ, 12,419 నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి రూ.5 వేల కోట్ల విలువైన 610 ఎకరాల భూమిని ఇవ్వడానికి సీఎం చంద్రబాబునాయుడు అంగీకరించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, భూముల క్రమబద్ధీకరణ ద్వారా వచ్చే ఆదాయం కూడా దేవస్థానానికే ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారన్నారు. కోర్టులో కేసు ఉందనే నెపంతో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ, ఎప్పుడో వారంతా ఇళ్లు నిర్మించుకున్నారని, వాటికి మరమ్మతులు చేయడానికి కూడా అధికారులు అంగీకరించడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అడ్వకేట్‌ జనరల్‌తో మాట్లాడి త్వరగా పంచ గ్రామాల భూ సమస్యకు పరిష్కారం చూపించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 05 , 2026 | 01:19 AM