Share News

నో మైనింగ్‌ జోన్‌గా పంచదార్ల కొండ

ABN , Publish Date - Aug 10 , 2026 | 12:51 AM

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పంచదార్ల కొండను’‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా గనుల శాఖ విశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఇ.నరసింహారెడ్డి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

నో మైనింగ్‌ జోన్‌గా పంచదార్ల కొండ
గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన పంచదార్ల కొండ (ఫైల్‌ ఫొటో)

గనుల శాఖ ఉన్నతాధికారులకు డీడీ నివేదిక

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పంచదార్ల కొండను’‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా గనుల శాఖ విశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఇ.నరసింహారెడ్డి సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు.

రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల మధ్య విస్తరించిన పంచదార్ల కొండపై గ్రావెల్‌ తవ్వకాలను చాలాకాలం నుంచి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక సంస్థ టెండరు వేసుకుని గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది కడపకు చెందిన ఒకరు క్వారీయింగ్‌కు అనుమతి తీసుకున్నారు. అయితే పరిమితికి మించి మైనింగ్‌ చేయడంపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. కొండ నుంచి వచ్చే జలధారలతో పరిసర గ్రామాలకు తాగునీరు అందుతుందని, ఇంకా పంచదార్ల ఆలయం ప్రాంగణంలోని పుణ్యధారల వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారని, అటువంటి కొండలపై మైనింగ్‌కు అనుమతులు ఇవ్వడం వల్ల జలధారల ఉనికికి ప్రమాదం ఏర్పడిందంటూ ఆందోళనలు చేశారు. మీడియాలో కథనాలు రావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ జోక్యంచేసుకొని, మైనింగ్‌ను నిలుపుదల చేయించారు. తరువాత మైనింగ్‌ జరిగిన ప్రాంతాన్ని గనులు, పంచాయతీ, ఇతర శాఖల అధికారులు తనిఖీచేశారు. గ్రావెల్‌ తవ్వకాల్లో పలు అక్రమాలు జరిగాయని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. పర్యావరణానికి విఘాతం కలుగుతున్నదని నివేదికలో పేర్కొన్నారు. దీంతోపాటు స్థానికుల వ్యతిరేకతను పరిగణనలోనికి తీసుకున్న ప్రభుత్వం, పంచదార్ల కొండను ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించింది. అయితే ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటించాలంటే గనుల శాఖలో కిందిస్థాయి నుంచి ప్రతిపాదనలు సంబంధిత ఉన్నతాధికారికి పంపాలి. దాని ఆధారంగా గనుల శాఖ అధికారికంగా ‘నో మైనింగ్‌ జోన్‌’గా ప్రకటిస్తుంది. దీంతో పంచదార్ల కొండపై ఇప్పటికే మంజూరు చేసిన రెండు మైనింగ్‌ లీజులు రద్దువుతాయి. గనుల శాఖ డీడీ ఇచ్చిన నివేదిక మేరకు త్వరలో పంచదార్ల కొండను ‘నో మైనింగ్‌ జోన్‌’గా అధికారికంగా ప్రకటించనున్నారు.

Updated Date - Aug 10 , 2026 | 12:51 AM