నాణ్యతగా ‘పల్లె పండుగ’ పనులు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:35 AM
గ్రామాల అభివృద్ధికి ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం కింద చేపట్టనున్న పనులు నాణ్యతగా వుండేలా కూటమి శ్రేణులు బాధ్యత తీసుకోవాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.
కూటమి శ్రేణులు బాధ్యత తీసుకొని పర్యవేక్షించాలి
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
నాతవరం/ నర్సీపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమం కింద చేపట్టనున్న పనులు నాణ్యతగా వుండేలా కూటమి శ్రేణులు బాధ్యత తీసుకోవాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. ‘వీబీ జీరామ్‌జీ’ కార్యక్రమం కింద మంగళవారం నాతవరం మండలం డి.యర్రవరంలో ‘పల్లె పండుగ 3.0’లో నల్లగొండమ్మతల్లి ఆలయం నుంచి గ్రామం వరకు రూ.60 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, రూ.16 లక్షలతో గ్రామంలో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ‘పల్లె పండుగ 3.0’ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో వివిధ రకాల రహదారుల నిర్మాణం, రైతులకు ఉపయోగపడే పనుల కోసం పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.11,085 కోట్లు మంజూరు చేశాయని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.5,391 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లు సమకూర్చాయని తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలో 421 పనులకు రూ.43.59 కోట్లు మంజూరయ్యాని చెప్పారు. ఇందులో నాతవరం మండలంలో 148 పనులకు రూ.21.86 కోట్లు, నర్సీపట్నం మండలంలో 104 పనులకు రూ.5.38 కోట్లు, గొలుగొండ మండలంలో 93 పనులకు రూ.6.26 కోట్లు, మాకవరపాలెం మండలంలో 76 పనులకు రూ.10.1 కోట్లు కేటాయించామని తెలిపారు. రానున్న మూడేళ్లలో నర్సీపట్నాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణ, జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, కూటమి నేతలు గన్నవరం సింగంపల్లి సన్యాసిదేముడు, వెలగా వెంకట కృష్ణారావు, ఎన్.విజయ్‌కుమార్, బెన్నయ్యనాయుడు, ఇనపసప్పల సత్యవతి, అంకంరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రాంబిల్లి/ చోడవరం సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి ) : ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం హరిపురం గ్రామంలో ‘పల్లె పండుగ 3.0’ పనులకు ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, కలెక్టర్ విజయకృష్ణన్, ఏపీ ఆర్‌డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ‘పల్లె పండుగ 3.0’ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని అన్నారు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో చేపడుతున్న అభివృది పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. గడువులోగా రహదారుల నిర్మాణం పూర్తి ప్రజలకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. చోడవరం నియోజకవర్గంలో ‘పల్లె పండగ 3.0’ కింద రూ.31.1 కోట్లతో 369 అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన చోడవరం పట్ణణ శివారు రేవళ్లు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.