Share News

నేటి నుంచి పల్లె పండుగ 3.0

ABN , Publish Date - Sep 29 , 2026 | 01:07 AM

గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున రహదారులు, ఇతర అభివృద్ధి పనులు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నేటి నుంచి పల్లె పండుగ 3.0

గ్రామాల్లో రూ.236.01 కోట్లతో 5,542 పనులు

అత్యధిక నిధులు సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయింపు

తారు, మెటల్‌, గ్రావెల్‌ రహదారులకు సైతం ప్రాధాన్యం

1,218 మంది రైతులకు పశువుల షెడ్లు మంజూరు

నేటి నుంచి గ్రామాల్లో పనులకు శ్రీకారం

అనకాపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున రహదారులు, ఇతర అభివృద్ధి పనులు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పల్లె పండుగ’ పేరుతో గత రెండు సంవత్సరాల్లో కోట్లాది రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మెటల్‌ రోడ్లు, రైతుల పశువులకు షెడ్లు నిర్మించిన విషయం తెలిసిందే. వరుసగా మూడో ఏడాది కూడా ‘పల్లె పండుగ-3.0’ పేరుతో శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు వీబీ- జీరామ్‌జీ కార్యక్రమం కింద జిల్లాలో దాదాపు అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జిల్లాలో రూ.236.01 కోట్ల అంచనా వ్యయంతో 5,542 పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో అత్యధిక నిధులు సుమారు 175 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికి కేటాయించారు. ఇంకా బీటీ (తారు) రోడ్లు, మెటల్‌ రోడ్లు, గ్రావెల్‌ రోడ్లు, పశువులకు షెడ్లు వున్నాయి.

గత ఏడాది ‘పల్లె పండుగ 2.0’ కింద జిల్లాలో 700 మంది రైతులకు పశువుల షెడ్లు నిర్మించిన ప్రభుత్వం ఈ ఏడాది ‘పల్లె పండుగ-3.0‘ కింద 1,218 షెడ్లను మంజూరు చేసింది. ఇందుకు రూ.22.64 కోట్లు కేటాయించింది. ఉద్యాన శాఖ ద్వారా పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 1,922 మంది రైతులకు రూ.18.62 కోట్ల విలువైన పనులు మంజూరు చేయనున్నారు. ఈ పనులను ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమక్షంలో ప్రారంభిస్తారు. ఇందుకోసం ఈ నెల 29వ తేదీ (మంగళవారం) నుంచి వచ్చే ఐదో తేదీ వరకు షెడ్యూల్‌ ప్రకారం ఆయా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్ని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


నేడు ఎస్‌ఎంసీ ఎన్నికలు

1,410 పాఠశాలల్లో నిర్వహణ

తల్లిదండ్రులు, సంరక్షకుల్లో సగం మంది హాజరు తప్పనిసరి

అనకాపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. సమగ్ర శిక్ష, పాఠశాల విద్యా శాఖల పర్యవేక్షణలో ఈ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలో 1,410 ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మండల విద్యా శాఖాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి కనీసం 50 శాతం మంది తల్లిదండ్రులు, సంరక్షకులు హాజరుకావాలని ప్రభుత్వం నిబంధన విధించింది. వంద మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలో 12 మంది, 100 మంది నుంచి 500 మంది విద్యార్థులుంటే 20 నుంచి 25 మంది సభ్యులను ఎన్నుకుంటారు. కమిటీ సభ్యుల్లో సగం మంది మహిళలు వుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు, దివ్యాంగులైన తల్లిదండ్రులకు కమిటీ సభ్యులుగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్‌ఎంసీ సభ్యుల ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ జరుగుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ల ఎన్నిక నిర్వహిస్తారు. అనంతరం ప్రమాణస్వీకారం ఉంటుంది. సాయంత్రం నాలుగు గంటలకు నూతన కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేస్తారు. గత ఏడాది ఎస్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా వివాదాలు చోటుచేసుకున్న ఎనిమిది పాఠశాలల్లో ఈసారి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

దేవరాపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘పల్లె పండుగ-3.0’ కింద మాడుగుల నియోజకవర్గంలో 401 రోడ్లు నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు అయినట్టు ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సోమవారం వెల్లడించారు. వివిధ గ్రామాల్లో 392 సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.37.85 కోట్లు, ఎనిమది మెటల్‌ రోడ్లు నిర్మాణానికి రూ.1,64,85,000, ఒక తారు రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే.. మాడుగులలో 41 సీసీ రోడ్లకు రూ.10 కోట్లు, చీడికాడలో 55 సీసీ రోడ్లకు రూ.9.7 కోట్లు, ఒక మెటల్‌ రోడ్డుకు రూ.30 లక్షలు, దేవరాపల్లిలో 164 సీసీ రోడ్లకు రూ.9,46,55,000, ఒక మెటల్‌రోడ్డుకు రూ.3.45 లక్షలు, ఒక తారు రోడ్డుకు రూ.50 లక్షలు, కె.కోటపాడులో 129 సీసీ రోడ్లకు రూ8,68,60,000, ఆరు మెటల్‌ రోడ్లకు రూ.1,31,40,000 ఖర్చు చేయనున్నట్టు ఎమ్మెల్యే బండారు వివరించారు.

Updated Date - Sep 29 , 2026 | 01:09 AM