Share News

నర్సీపట్నం చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పద్మావతి నామినేషన్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:57 AM

మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కూటమి అభ్యర్థిగా శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, మాజీ కౌన్సిలర్‌ పద్మావతి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు అబీద్‌ సెంటర్‌లోని నూకాలమ్మ ఆలయంలో అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెదబొడ్డేపల్లిలోని మునిసిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.

నర్సీపట్నం చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పద్మావతి నామినేషన్‌
మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఎన్నికల అధికారి వీవీ రమణకు నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న చింతకాయల పద్మావతి, ఎంపీ రాజేశ్‌, కూటమి నాయకులు

హాజరైన కూటమి నేతలు

చైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిలర్‌ పదవులకు తొలిరోజు 14 నామినేషన్లు

నర్సీపట్నం, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కూటమి అభ్యర్థిగా శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, మాజీ కౌన్సిలర్‌ పద్మావతి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు అబీద్‌ సెంటర్‌లోని నూకాలమ్మ ఆలయంలో అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెదబొడ్డేపల్లిలోని మునిసిపల్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. మునిసిపల్‌ ఎన్నికల అధికారి, ఆర్డీవో వీవీ రమణకు రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు అందజేశారు. కాగా చిన్న కోడలు దివ్యశ్రీ చైర్‌పర్సన్‌తోపాటు 38వ వార్డు కౌన్సిలర్‌ పదవికి నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కృషితో పట్టణంలో రూ.57 కోట్లతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం మునిసిపాలిటీని పట్టించుకో లేదని, వీధి లైట్లు కూడా వెలగని పరిస్థితి చూశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చింతకాయల విజయ్‌, టీడీపీ నేతలు రాజేశ్‌, సుకల రమణమ్మ, ఆదిలక్ష్మి, జనసేన పార్టీ నాయకుడు సూర్యచంద్ర, బీజేపీ నాయకుడు అడిగర్ల సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

చైర్‌పర్సన్‌కు 4, కౌన్సిలర్లకు 10 నామినేషన్లు

నర్సీపట్నం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి తొలి రోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కూటమి తరపున చింతకాయల పద్మావతి రెండు సెట్లు, ఆమె చిన్న కోడలు దివ్యశ్రీ ఒక నామినేషన్‌, జనసేన తరపున అద్దేపల్లి సౌజన్య నామినేషన్‌ వేశారు. కౌన్సిలర్‌ పదవులకు పది నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన తరపున 30వ వార్డు నుంచి అప్పన వీర వెంకట సురేశ్‌బాబు, 13వ వార్డు నుంచి అద్దేపల్లి సౌజన్య, వైసీపీ తరపున 21వ వార్డు నుంచి మాకిరెడ్డి బుల్లిదొర, మాకిరెడ్డి కృష్ణవేణి, 27వ వార్డు నుంచి మురుకుర్తి రమణ, 39వ వార్డు నుంచి హప్సిబా, 14వ వార్డు నుంచి రేవు రామచంద్రకుమార్‌, 19వ వార్డు నుంచి తమరాన కృష్ణవేణి, తమరాన జగదీశ్వరి నామినేషన్లు వేశారు.

Updated Date - Oct 17 , 2026 | 12:57 AM