Share News

కిక్కిరిసిన రైళ్లు

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:43 AM

పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో చాలామంది సొంతూళ్లకు బయలుదేరారు.

కిక్కిరిసిన రైళ్లు

విద్యా సంస్థలకు దసరా సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు ప్రయాణాలు షురూ

పోటెత్తిన రైల్వే స్టేషన్‌

ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లన్నీ ఫుల్‌

విశాఖపట్నం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి):

పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో చాలామంది సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో శనివారం రైల్వేస్టేషన్‌లోని అన్ని ప్లాట్‌ఫామ్‌లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిక్కిరిసి నడిచాయి. విజయవాడ చట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేవారు విశాఖ-లింగంపల్లి...జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12805), విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240) రైళ్లను, బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాలకు వెళ్లేవారు విశాఖ-భువనేశ్వర్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ (18412), విశాఖ-పార్వతీపురం ప్రత్యేక రైళ్లను ఆశ్రయించారు. అలాగే సికింద్రాబాద్‌, చెన్నై, ముంబై ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రయాణికులు గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్‌, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ప్రెస్‌, మెయిల్‌, కోరమండల్‌, ఎల్‌టీటీ, కోణార్క్‌, ఫలక్‌నుమా, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో విశాఖకు చేరుకున్నారు.

రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు తాకిడి

విజయవాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు శనివారం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12717) బయలుదేరడానికి గంట ముందుగానే స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో ఎనిమిదో నంబరు ప్లాట్‌ఫామ్‌ ప్రయాణికులతో నిండిపోయింది. విజయవాడ నుంచి రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12718) మధ్యాహ్నం 12.20 గంటలకు స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికే వేచి ఉన్నవారంతా ఒక్కసారిగా జనరల్‌ బోగీల్లో సీట్ల కోసం ఎగబడ్డారు. విజయవాడ నుంచి వచ్చిన ప్రయాణికులు కోచ్‌ నుంచి దిగుతుండగానే కొందరు లోపలకు వెళ్లే ప్రయత్నం చేయడంతో ప్రవేశద్వారం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమై తొక్కిసలాట జరగకుండా చర్యలు చేపట్టారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే మరికొందరు ప్రయాణికులు విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727)లలో జనరల్‌ కోచ్‌లను ఆశ్రయించారు.

ప్రధాన రైళ్లు ఫుల్‌

హౌరా వెళ్లే రైళ్లు కిక్కిరిసి నడిచాయి. అదేవిధంగా విజయవాడ మీదుగా సికింద్రాబాద్‌, చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిండు బెర్తులతో బయలుదేరాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17015), గరీబ్‌రథ్‌ (12739), కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11020), ఫలక్‌నుమా (12703), ఎల్‌టీటీ (18519), ప్రశాంతి (18463), హౌరా-యశ్వంతపూర్‌ (12863), కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12841), మెయిల్‌ (12839), టాటా-ఎర్నాకులం (18189), బొకారో (13351) వంటి ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులు ముందే రిజర్వు అయిపోయాయి. ఆదివారం కూడా గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), గరీబ్‌రఽథ్‌ (12739), ఎల్‌టీటీ (18519), వందేభారత్‌ (20708, 20833) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులు అందుబాటులో లేవు.

Updated Date - Oct 11 , 2026 | 12:43 AM