కేజీహెచ్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్వీర్యం!
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:58 AM
కేజీహెచ్‌లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి.
కరోనా సమయంలో రూ.5 కోట్లతో ఆరు ప్లాంట్లు ఏర్పాటు
ప్రాణాపాయం నుంచి బయటపడిన వందలాది మంది...
ఆ తరువాత వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఆస్పత్రి ఉన్నతాధికారులు
ప్రస్తుతం అవసరాలకు ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు
నెలకు రూ.లక్షలు చెల్లింపు
విశాఖపట్నం, జూన్ 30 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన ఆక్సిజన్ ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సమయంలో రూ.పది కోట్లతో ఆరు ప్లాంట్లు ఏర్పాటుచేశాయి. వీటి ద్వారా పదుల సంఖ్యలో పడకలకు ఆక్సిజన్ సరఫరా అయ్యేలా వ్యవస్థను రూపొందించడం జరిగింది. ప్లాంట్ల ఏర్పాటుతో ఎంతోమంది ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అటువంటి ప్లాంట్లు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం నిర్వీర్యమై పోయాయి. దీంతో ప్రైవేటు సంస్థ నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేస్తూ ప్రతినెలా లక్షలాది రూపాయలు బిల్లు చెల్లిస్తున్నారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి..
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఆక్సిజన్ పెద్దఎత్తున అవసరం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేశాయి. ఈ క్రమంలోనే కేజీహెచ్‌లో ఆరు ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఇందుకోసం సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేశారు. వీటి ద్వారా వందల సంఖ్యలో పడకలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులకు ఆక్సిజన్ నిత్యం అవసరమవుతుంది. ముఖ్యంగా ఐసీయూ, ఎన్‌ఐసీయూతోపాటు ఇతర అత్యవసర విభాగాల్లోని రోగులకు ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. ఇందుకు ఆస్పత్రిలోని ఆరు ఆక్సిజన్ ప్లాంట్లు ఉపయోగపడతాయి. కాకపోతే విద్యుత్ వినియోగం కాస్త ఎక్కువ అవుతుంది. ఈ కారణాన్ని చూపించి అధికారులు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్లక్ష్యం చేసినట్టు చెబుతున్నారు.
నెలకు లక్షల రూపాయలు బిల్లులు
ఆస్పత్రిలో ఉన్న ప్లాంట్లను గాలికి వదిలేసిన అధికారులు...ప్రస్తుతం రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్‌ను ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఆస్పత్రిలో 20 కిలో లీటర్లు, 13 కిలోలీటర్లు సామర్థ్యం కలిగిన రెండు ట్యాంకర్లు ఉన్నాయి. వాటిలో ప్రైవేటు సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఆక్సిజన్‌ను స్టోర్ చేసి వార్డులకు సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సరఫరా సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఆక్సిజన్ కోసం ప్రతినెలా రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు సదరు సంస్థకు చెల్లిస్తున్నారు. దీనికి బదులుగా ఆస్పత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్లను వినియోగంలోకి తీసుకువస్తే ఆ ఖర్చు మిగులు తుంది. ఆస్పత్రిలోని ఆరు ఆక్సిజన్ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చేందుకు రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అవి మంజూరుచేస్తే మళ్లీ ప్లాంట్స్‌ను పునరుద్ధరించవచ్చునని చెబుతున్నారు. అప్పుడు ప్రైవేటు సంస్థకు నెలనెలా లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉండదంటున్నారు.
గత వారం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆక్సిజన్ ప్లాంట్ల విషయాన్ని ప్రస్తావించారు. ప్లాంట్లను వినియోగంలోకి తీసుకురావడంపై అధ్యయనం చేయాలని సూచించారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటుచేయాలని, తదుపరి కార్యాచరణకు సంబంధించి నివేదిక అందజేయాలని ఆదేశించారు.